‘ఎవరెస్టు’ను అధిరోహించిన గిరిజన తేజం

26 May, 2019 01:21 IST|Sakshi
ఎవరెస్టుపై జాతీయజెండాను ఆవిష్కరిస్తున్న తుకారాం. (ఇన్‌సెట్‌లో) తుకారాం

మంచు పర్వతంపై జాతీయజెండాను ఎగురవేసిన అంగోత్‌ తుకారాం

యాచారం(ఇబ్రహీంపట్నం): గిరిపుత్రుడి సాహసయాత్ర విజయవంతమైంది. ప్రపంచంలోనే ఎల్తైన శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పాడు. అతడే అంగోత్‌ తుకారాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన తుకారాం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. ఏప్రిల్‌ 5న నేపాల్‌ నుంచి తుకారాం తన సాహసయాత్రను ప్రారంభించాడు. దాదాపు 50 రోజులపాటు ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి తన జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకున్నాడు. ఈ నెల 22న 8,845 మీటర్ల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి అక్కడ జాతీయజెండాను ఎగురవేశాడు.

3 రోజుల క్రితమే ఎవరెస్టును అధిరోహించినప్పటికీ అక్కడ ప్రతికూల వాతావరణం ఉండటంతో బేస్‌క్యాంపు వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎవరెస్టును అధిరోహించినట్లు నేపాల్‌ ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు తుకారాం ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపాడు. ఈ సాహసయాత్రలో తాను ప్రాణాలతో వస్తానని అనుకోలేదని తెలియజేశాడు. శిఖరాన్ని అధిరోహించడానికి అన్నివిధాలుగా సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాంచంద్రునాయక్, ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ లచ్చిరాం, రైల్వే చీఫ్‌ ఇంజనీర్‌ తౌర్యానాయక్, పారిశ్రామిక వేత్త సుధాకర్‌రావుల సహకారంతో ఎవరెస్టు యాత్రకు బయలుదేరాడు.  

తుకారాం.. పర్వతారోహణలో దిట్ట
అంగోత్‌ రాందాసు, జంకుల దంపతుల నాలుగో సంతానమైన తుకారాం పర్వతారోహణలో దిట్ట. నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనీరింగ్‌లో శిక్షణ పొందాడు. 2016 జూన్‌ 2న మొదటిసారి హిమాచల్‌ప్రదేశ్‌లోని 17,145 అడుగుల నార్భో పర్వతా న్ని ఎక్కి తెలంగాణ జెండాను ఎగురేసి, బతుకమ్మ ఆడి రాష్ట్ర ఖ్యాతిని చాటాడు. 2017 జూన్‌ 2న ఉత్తరాఖండ్‌లో 19,091 అడుగుల రుదుగైరా పర్వతాన్ని అధిరోహించాడు. హిమాలయాల్లోని 20,187 అడుగుల స్టాక్‌కాంగ్రీ పర్వతాన్ని 2017 జూలై 15న అధిరోహించాడు. ఇలా పలు మంచు పర్వతాలు అలవోకగా అధిరోహించినందుకుగాను హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో తుకారాం తన పేరు నమోదు చేసుకున్నాడు. 2018 జూలైలో సౌతాఫ్రికాలో 5,895 మీటర్ల కిలిమంజారో మంచు పర్వతాన్ని అధిరోహించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ల ప్రశంసలు పొందాడు.

>
మరిన్ని వార్తలు