లాక్‌డౌన్‌: కాలినడకన వెళ్లి ప్రమాదంలో పడొద్దు!

15 Apr, 2020 16:35 IST|Sakshi

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించడంతో ఇతర రాష్ట్రాల వలస కూలీలు, కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. కాలినడకన సొంత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో చిన్న పిల్లలతో ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. జాతీయ రహదారులపై ఎక్కువ దూరం నడవడం వల్ల రోడ్డు ప్రమాదాలు.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కార్మికులకు, వలస జీవులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. 
(చదవండి: వైరల్‌ వీడియో: చిన్న జీతం.. పెద్ద మనసు)

అదేవిధంగా లాక్‌డౌన్‌పై తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరూ ఇబ్బందులు పడొద్దని సజ్జనార్‌ వెల్లడించారు. లాక్‌డౌన్‌పై అపోహలు, అనుమానాలు పెంచుకోకుండా ఎక్కడివారక్కడే ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు,కూలీలకు, వలస కార్మికులకు రాష్ట్ర పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆహార, ఆరోగ్య సమస్యలుంటే ప్రభుత్వ యంత్రాంగం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆశ్రయం కోల్పోయిన వారి కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసిందని సజ్జనార్‌ గుర్తు చేశారు.
(చదవండి: కరోనా: గాంధీలో 20 మంది పాజిటివ్‌ చిన్నారులు)

‘దేశమంతా లాక్‌డౌన్‌తో స్తంభించిన వేళ.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లినా.. ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కార్మికుల బాగోగులు చూసుకోవాలని భవన నిర్మాణ సంస్థలు, పలు కంపెనీలకు ఆదేశాలు జారీ చేసాం. ప్రభుత్వ, పోలీస్ శాఖ ఆదేశాలను కార్మిక సంస్థలు, భవన నిర్మాణ సంస్థలు బేఖాతర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని కమిషనర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు