లాక్‌డౌన్‌: భారీగా రోడ్డెక్కిన వాహనాలు

9 May, 2020 11:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సడలింపులతో హైదరాబాద్‌లో వాహనాల సందడి నెలకొంది. పలు రంగాలకు సడలింపులు ఇవ్వడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కడంతో ప్రధాన కూడళ్లలో శనివారం ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాల రద్దీని నివారించేందుకు కొన్నిచోట్ల ప్లైఓవర్లను కూడా తెరిచారు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు నెలన్నర రోజులుగా ఆపేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించారు. దీంతో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద మునుపటి సందడి నెలకొంది. సడలింపులను ఆసరా చేసుకుని అనవసరంగా రోడ్డు మీదకు వస్తున్న వారికి పోలీసులు అడ్డుకుని జరిమానాలు విధిస్తున్నారు.

రెడ్‌జోన్‌లో ఉన్న హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు, నిర్మాణ రంగం వంటి కొన్ని రంగాలకు మాత్రమే షరతులతో కూడిన సడలింపులు ఉన్నాయని చెబుతున్నారు. ప్రత్యేక పాస్‌ ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. కాగా, ఎల్బీనగర్ చెక్‌పోస్ట్‌ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వాహనదారులను తనిఖీ చేసి పంపిస్తుండటంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సిగ్నల్స్ పునరుద్ధరించకపోవడం, రాంగ్ రూట్‌లో వాహనదారులు వస్తుండటంతో కొన్నిచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనుమతి లేని వారు రోడ్డు మీద​కు రావొద్దని పోలీసులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఈనెల 29 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. (మాస్క్‌ లేకుంటే బుక్కయినట్టే..!)
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు