3 ముక్కలు కానివ్వం

22 Aug, 2014 00:37 IST|Sakshi
3 ముక్కలు కానివ్వం
  • అమిత్ షా అభినందన సభలో దత్తాత్రేయ
  • సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్  మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆ ఎత్తులు పారనివ్వబోమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంఐఎంతో చేతులు కలిపిన టీఆర్‌ఎస్ వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొంటోందని తీవ్రంగా విమర్శించారు.

    సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో గురువారం ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని ప్రభుత్వం చెబుతోందని...వాటి ఫలితాలను చూసి నిరుద్యోగులు, నిరుపేదలను సంఘటిత పర్చి ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని దత్తాత్రేయ హెచ్చరించారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రావడానికి బీజేపీ ఎలా తోడ్పాటు అందించిందో...అభివృద్ధి విషయంలోనూ అలాగే ముందుంటుందని తెలిపారు.

    హైదరాబాద్‌లో 40 లక్షల వాహనాలు ఉన్నాయని... వీటివల్ల వాయు కాలుష్యం పెరుగుతోందన్నారు. ఇంటింటికీ గ్యాస్ ఇచ్చే కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోందని దత్తాత్రేయ వెల్లడించారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించాలంటే బూత్ స్థాయిలోనే పార్టీని పటిష్టం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
     

మరిన్ని వార్తలు