తెలంగాణలోనే అమిత్‌ షాకు సభ్యత్వం 

27 Jul, 2019 02:47 IST|Sakshi

రంగారెడ్డి లేదా మహబూబ్‌నగర్‌లో తీసుకోనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు 

ఆగస్టు 15–17 మధ్య పర్యటన  

టార్గెట్‌ టీడీపీ.. ఆపరేషన్‌ తెలంగాణ వేగవంతం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే చర్యలు వేగవంతమయ్యాయి. రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. తెలంగాణలోనే క్రియాశీల సభ్యత్వం తీసుకోబోతున్నారు. రంగారెడ్డి లేదా మహబూబ్‌నగర్‌లో ఆయన బీజేపీ సభ్యత్వం తీసుకోనున్నట్లు తెలిసింది. ఆగస్టు 15–17 తేదీల మధ్య ఆయన రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ఆ సమయంలోనే టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన  25 మంది ముఖ్య నేతలను బీజేపీలో చేర్పించడానికి పార్టీ వర్గాలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగానే టార్గెట్‌ టీడీపీని ముమ్మరం చేశారు.

ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. ఆ పార్టీ కేడర్‌ మొత్తాన్ని తీసుకొచ్చే చర్యలు చేపట్టింది. ముందుగా వివిధ జిల్లాల్లోని నియోజకవర్గ స్థాయి నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు అమిత్‌షాను కలవగా.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలు కూడా ఆయనతో టచ్‌లోకి వెళ్లారు. వారంతా అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలు రాంమాధవ్, లక్ష్మణ్, మురళీధర్‌రావు టీడీపీ నేతలతో మంతనాలు జరిపారు. బీజేపీలో చేరిన టీడీపీ నేత గరికపాటి రామ్మోహన్‌రావు నేతృత్వంలో టార్గెట్‌ టీడీపీని కొనసాగిస్తున్నట్లు సమాచారం. 

మూడు అంశాలపై అమిత్‌ షా దృష్టి... 
బీజేపీ చేపట్టిన ఆపరేషన్‌ తెలంగాణను పూర్తి స్థాయిలో ఆచరణలోకి తెస్తోంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న అమిత్‌ షా.. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించారు. పార్టీలోకి భారీ ఎత్తున ముఖ్య నేతల చేరికలు ఉండేలా చూడాలని ఇప్పటికే రాష్ట్ర పార్టీ నేతలకు స్పష్టంచేశారు. అలాగే రాష్ట్రంలో 18 లక్షల సభ్యత్వ నమోదును టార్గెట్‌గా పెట్టారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ అంశాలను రాష్ట్ర పార్టీ నేతలు సరిగ్గా చేయలేకపోతే తానే రంగంలోకి దిగుతానన్నారంటే  ఆయన ఎంతగా దృష్టి సారించారో అర్థం చేసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఆగస్టు ఒకటో తేదీ నుంచి 7 వరకు సభ్యత్వ నమోదు స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు