అమిత్‌ షా ఎదుట స్వాముల ఆవేదన

10 Oct, 2018 13:49 IST|Sakshi
అమిత్‌ షా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చారు. ఢిల్లీ నుంచి ఆయన నేరుగా బేగంపేట విమానాశ్రయానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. అక్కడ స్థానిక బీజేపీ అగ్రనేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్‌ చేరుకుని అక్కడ మహారాజా శ్రీ అగ్రసేన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అగ్రసేన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, పలు వైశ్య సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత కాచిగూడ శ్యామ్‌ మందిరాన్ని సందర్శించి సాధువులతో సమావేశమయ్యారు.

తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై సాధువులు అమిత్‌ షా దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. తెలంగాణాలో హిందువులపై దాడులు జరుగుతున్నా సర్కార్‌ పట్టించుకోవడం లేదని, దాడులు చేసిన వారికే ప్రభుత్వం అండగా ఉంటుందని స్వాములు, అమిత్‌ షా ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ భేటి ముగిసిన తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బూత్‌కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు సమావేశం నిర్వహించారు. అనంతరం కరీంనగర్‌లోని అంబేద్కర్‌ స్టేడియంలో జరిగే సమరభేరి బహిరంగ సభలో పాల్గొంటారు.  ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై మార్గదర్శనం చేయనున్నట్లు తెలిసింది.

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
బీజేపీ అధికారంలోకి వస్తే కొడుకులు, కూతుళ్లు అధికారంలో ఉండరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లో ప్రధాని నరేంద్రమోదీ గాలిలో కేసీఆర్‌ కొట్టుకపోతామనే భయంతోనే ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లారని ఎద్దేవ చేశారు. అభివృద్ది కోసమే ఎన్నికలకు వెళ్లామని టీఆర్‌ఎస్‌ కట్టుకథలు చెబుతోందని.. కానీ ఎన్నికల తర్వాత కొడుకును లేక కుమార్తెను సీఎం చేయడానికే ముందస్తుకు వెళ్లారని తెలిపారు.   వారి అవసరం కేసీఆర్‌కు అక్కర్లేదని మండిపడ్డారు.

మతం ఆధారంగా రిజర్వేషన్లను బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోను ఒప్పుకోదని స్పష్టంచేశారు. ప్రజలను రెచ్చగొట్టడానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రోహింగ్యాలు వస్తే కనీసం ఇక్కడి ప్రజల కోసం కూడా కేసీఆర్‌ ఆలోచనచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.   కేసీఆర్‌ యూపీఏ సర్కార్‌లో మంత్రిగా ఉన్నారని.. అయినా 13వ ఆర్థిక సంఘంలో రూ.16,597 కోట్లు మాత్రమే తెలంగాణకు వచ్చాయని, కానీ ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘంలో రూ.1,15,605 కోట్లు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. ఇంత చేసినా మోదీ తెలంగాణకు అన్యాయం చేసారనడం హాస్యాస్పదమన్నారు. 

మరిన్ని వార్తలు