నేడు అమిత్‌ షా రాక..

6 Mar, 2019 07:08 IST|Sakshi
భూమారెడ్డి కన్వెన్షన్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న లక్ష్మణ్, తదితరులు

ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గ శక్తికేంద్రాలు, బూత్‌ ఇన్‌చార్జుల సమావేశం

ఏర్పాట్లు పరిశీలించిన పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌

పటిష్ట భద్రతా ఏర్పాట్లు..

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): పార్లమెంట్‌ ఎన్నికలకు బీజేపీ సమాయాత్తమవుతోంది. అందులో భాగంగా నిర్వహించే నిజామాబాద్, ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ క్లస్టర్‌ స్థాయి సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా నేడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గ శక్తికేంద్రాలు, బూత్‌ ఇన్‌చార్జులు, ఆయా జిల్లాల పదాధికారులతో సమావేశం బుధవారం నగరశివారులోని భూమారెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్నారు. మొదట ఫిబ్రవరి 13న ఈ సమావేశం నిర్వహించాలని భావించినా, అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన విషయం తెలిసిందే. నేటి సమావేశానికి హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయల్దేరనున్న అమిత్‌ షా మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్‌ చేరుకోనున్నారు. ఇందుకోసం నగరంలోని దుబ్బలోగల గిరిరాజ్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారు. సుమారు 4వేల మంది నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది.


ఈ క్లస్టర్‌ స్థాయి సమావేశానికి బీజేపీ అగ్రనేతలు డాక్టర్‌ లక్ష్మణ్, తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జి అరవింద్‌ లింబావళి, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, నాయకులు కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్‌ హాజరుకానున్నారు.  సమావేశం ఏర్పాట్లను మంగళవారం జిల్లాకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌ పర్యవేక్షించారు. అమిత్‌ షా ప్రసంగించే వేదిక, హాల్‌తో పాటు గదులను పరిశీలించారు. ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి వచ్చే జాతీయ, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, శక్తికేంద్రాల ఇన్‌చార్జులు, బూత్‌ అధ్యక్షులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా చూడాలని స్థానిక నాయకత్వానికి సూచించారు. ఆయనవెంట రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్, టక్కర్‌ హన్మంత్‌రెడ్డి, పల్లె గంగారెడ్డి, ధర్మపురి అర్వింద్, బస్వా లక్ష్మీనర్సయ్య, లలోక భూపతిరెడ్డి, సదానంద్‌రెడ్డి, న్యాలం రాజు, మల్లేష్‌ యాదవ్, తదితరులు ఉన్నారు.

భారీ పోలీసు బందోబస్తు

నిజామాబాద్‌అర్బన్‌: అమిత్‌షా పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసిన గిరిరాజ్‌ కళాశాల గ్రౌండ్‌ను సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. కళాశాల మైదానం నుంచి భూమారెడ్డి కన్‌వెన్షన్‌ వరకు రోడ్డు మార్గం ద్వారా బందోబస్తు నిర్వహించనున్నారు. సీపీ కార్తికేయ సమావేశం జరిగే ప్రాంగణాన్ని మంగళవారం పరిశీలించారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పాటు ఏఆర్‌ పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా