అమ్మా.. నన్ను కాపాడు

20 Oct, 2014 00:34 IST|Sakshi
అమ్మా.. నన్ను కాపాడు
  • ఖతర్ నుంచి కన్నపేగు ఘోష
  • కుటుంబ భారాన్ని మోయడానికి ఖతర్ వెళ్లిన యువతి కష్టాల్లో చిక్కుకుంది. అక్కడ నరకం చూస్తున్నానని నెల క్రితం తల్లికి ఫోన్‌లో చెప్పిన యువతి నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదు.. ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా, పెద్ద దిక్కుగా ఉన్న సోదరుడు మంచం పట్టాడు..ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లిన యువతి సమాచారం అందకపోవడంతో ఆ తల్లి పడ రాని పాట్లు పడుతోంది..
     
    సాక్షి, సిటీబ్యూరో: ‘‘అమ్మా.. నన్ను రక్షించు, దేశం కాని దేశానికి పంపించావు, వాళ్లు ఇక్కడ నరకం చూపిస్తున్నారు, నీవు నన్ను త్వరగా రప్పించుకో లేకపోతే నా ప్రాణాలు పోతాయి’’ అని ఓ యువతి ఖతర్ దేశం నుంచి నగరంలోని తన తల్లికి ఫోన్ చేసి వేడుకుంది. దీంతో ఆ తల్లి తన కూతురు కోసం తల్లిడిల్లుతోంది.
     
    ఎనిమిదేళ్ల క్రితం భర్త మృతి.. మంచం పట్టిన పెద్ద కుమారుడు...


    కాటేదాన్‌కు చెందిన మాధవి , సత్యనారాయణ దంపతులు. వీరికి కుమారులు కార్తీక్ (20), అర్జున్ (18), కూతురు లత (22) సంతానం. పాతబస్తీలో ఓ వెల్డింగ్ షాపులో పనిచేసే సత్యనారాయణ ఎనిమిదేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అయినా మాధవి ధైర్యం కూడగట్టుకుని కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో  కూలీ పనులు చేస్తూ ముగ్గురు పిల్లల్ని చదివించింది.

    రెండేళ్ల క్రితం చేతికి ఎదిగిన కొడుకు కార్తీక్ పురానాపూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నేటికి  కూడా  ఇంట్లో మంచంమీదే ఉండే పరిస్థితి. మరోపక్క అప్పులు పెరిగిపోయాయి. కుటుంబం చాలా కష్టంగా నడుస్తోంది. ఈ స్థితిలో వనితా కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన లత తాను కూడా కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంది.  ఈ క్రమంలోనే చార్మినార్‌కు చెందిన రషీద్ మాధవికి పరిచయం అయ్యాడు.
     
    జీతం రూ.13 వేలని నమ్మించి..

    ఖతర్ దేశంలో మా వదినే ఇంట్లో పనిచేసేందుకు లతను పంపిస్తే నెలకు రూ.13 వేలు వ స్తాయి, అప్పులన్నీ తీర్చ వచ్చని రషీద్ ఆమెతో నమ్మబలికాడు. కుటుంబ భారం మోయడానికి  లత ఖతర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యింది. రషీద్ లతకు పాస్‌పోర్టు ఇప్పించి, జనవరిలో ఖతర్‌కు పంపించాడు. నాలుగైదు నెలలు లత అక్కడ బాగానే ఉందని మాధవికి రషీద్ చెప్పేవాడు. కాగా గత నెల మొదటి వారంలో లత తన తల్లికి ఫోన్ చేసింది. అమ్మా ఇక్కడ నాకు నరకం చూపిస్తున్నారు, నన్ను వెంటనే తీసుకెళ్లు, ఇక్కడుంటే చంపేస్తారు అని  కన్నీరుమున్నీరైంది.

    రషీద్‌తో మాట్లాడి తీసుకువస్తానని ఆమెకు ధైర్యం చెప్పింది. తన కూతురుకు ఏదో అపాయంలో ఉందని భావించిన మాధవి, రషీద్ వద్దకు వెళ్లి తన కూతురు గురించి అడిగింది. వెంటనే తన కూతురు కావాలని కోరింది. రషీద్‌ను గట్టిగా నిలదీయడంతో రెపో మాపో రప్పిస్తానని సముదాయించాడు. ఖతర్‌లో ఉన్న రషీద్ వదినకు ఫోన్‌చేసిన మాధవికి ‘‘ నీ కూతురు ఎక్కడికో వెళ్లిపోయింది, బతికుంటే వస్తుందిలే అని నిరక్ష్యంగా సమాధానం చెప్పడంతో,  నెల రోజులు పూర్తయినా కూతురు జాడ లేకపోవడంతో వారం రోజుల క్రితం పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించింది. అయితే వారు స్పందించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు.
     
    ఇంటి ఆర్థిక పరిస్థితి చూసి తట్టుకోలేకనే భారాన్ని భుజాన వేసుకున్న నా కూతురు లత విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లి ఆపదలో చిక్కుకుందని మాధవి సాక్షితో తన ఆవేదనను వ్యక్త పర్చింది. తన కూతుర్ని రక్షించి క్షేమంగా నగరానికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఇదిలావుండగా దుబాయ్‌లో అరబ్‌షేక్ చేతుల్లో  చిక్కుకున్న నగరానికి చెందిన ఓ మహిళను చైతన్యపురి పోలీసులు స్పందించి ఆమెను  రక్షించి  క్షేమంగా నగరానికి వారం రోజుల క్రితం రప్పించారు. అలాగే లతను కూడా రప్పించాలని ఆమె కోరుతుంది.
     

మరిన్ని వార్తలు