అమ్మఒడి కొందరికే! 

7 Oct, 2017 03:42 IST|Sakshi

అరకొరగా ‘102’ వాహన సేవలు 

సాక్షి, హైదరాబాద్‌: బాలింతలను, నవజాత శిశువులను సురక్షితంగా ఇళ్లకు చేర్చే ‘102’ వాహనాల సేవలు కొందరికే పరిమితమవుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళికలేమితో కొన్ని ప్రాంతాల్లోనే ఈ సేవలు అమలవుతున్నాయి. కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అయిన వారిని ఇళ్లకు చేర్చే సేవలను మాత్రం విస్తరించడంలేదు. దీంతో బాలింతను, శిశువును ఇళ్లకు తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

కేంద్రం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగమైన జననీ సురక్ష యోజన నిధులతో రాష్ట్రం అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జీవీకే ఈఎంఆర్‌ఐ భాగస్వామ్యంతో ‘102’ వాహనాల సేవలను నిర్వహిస్తోంది. కేవలం 12 జిల్లాల్లోనే ఈ సేవలు అందుతున్నాయి. ప్రజా రవాణా వాహనాల్లో వెళ్లాల్సి రావడంతో కొన్నిసార్లు బాలింతలకు, నవజాత శిశువులకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని తొలగించేందుకు అన్ని జిల్లాల్లో ‘102’ సేవలను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించినా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు పెరుగుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు