'మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదు'

10 Mar, 2020 10:25 IST|Sakshi

సాక్షి, మిర్యాలగూడ  : పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదని, భవిష్యత్తులో దానిపై ఎలాంటి న్యాయ పోరాటం చేయబోనని ఆయన కూతురు అమృత స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని ప్రణయ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక మనిషి మరో మనిషిని చంపడం మంచిది కాదన్నారు. ప్రణయ్‌ను చంపి మారుతీరావు తప్పు చేశాడని, అయినా చనిపోయిన వారిపై గౌరవంతోనే తాను శ్మాశానవాటిక వద్దకు వెళ్తే చూడనివ్వలేదని అన్నారు. (డబ్బుల కోసం అమృత డ్రామాలాడుతోంది..)

ఆయన చివరి కోరిక ప్రకారం నేను అమ్మ వద్దకు వెళ్లేది లేదని, ఆమె నా వద్దకు వస్తే నా వద్దే ఉంచుకుంటానని తెలిపారు. తన బాబాయి శ్రవణ్‌ వలన ఆమెకు ప్రాణహానీ ఉండవచ్చని ఆరోపించారు. మారుతీరావు ఆస్తి తన పేరుపై లేదని తెలిపారు. అది బినామీల పేరుపై ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్‌ను చంపే వరకు కూడా ఆస్తి ఉమ్మడిగానే ఉందని జైలు నుంచి విడుదలైన తర్వాతే పంచుకున్నారని విన్నానని తెలిపారు. ఒక మనిషిని చంపేంత ధైర్యం ఉన్న వాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, ఇతర ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలియదని అన్నారు.

భర్త పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసని, మా అమ్మ బాధను అర్థం చేసుకోగలని తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. ఆ విషయంపై మా ఇంటికి వచ్చిన వారిని సీసీ కెమరాల్లో చూశానని, ఆ సమయంలో వచ్చిన వ్యక్తితో ఖరీం ఫోన్‌లో మాట్లాడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వీలునామా గురించి నాకు తెలియదని తెలిపారు. (చిచ్చుపెట్టిన ప్రేమ వివాహం)

తండ్రి అని సంబోధించని అమృత..
అమృత మీడియాతో మాట్లాడినంత సేపు మారుతీరావు, గిరిజ, శ్రవణ్‌ అని మాత్రమే సంబోధించారు.  కానీ తండ్రి, తల్లి, బాబాయి అనే పదాలు కూడా ఆమె నోటి నుంచి రాలేదు. కూతురు కోసమే చనిపోయాడని బయట మాటలు వినిపిస్తున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఒకరి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు, వారి ప్రాణాలు వారు తీసుకునే హక్కు కూడా లేదన్నారు. తండ్ని అని సంబోధించకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు దాట వేస్తూ వెళ్లిపోయారు. 

మరిన్ని వార్తలు