గ్రామీ అవార్డుల రేసులో ‘అనంత’ ఆల్బమ్‌

14 Oct, 2017 03:17 IST|Sakshi

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో విడుదల

30 మంది దిగ్గజాల గాత్ర, స్వర సహకారం

300 నిమిషాల నిడివితో అతిపెద్ద భారతీయ సంగీత సంకలనం  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ విడుదల చేసిన ‘అనంత వాల్యూమ్‌–1 మెస్ట్రోస్‌ ఆఫ్‌ ఇండియా’ శాస్త్రీయ సంగీత ఆల్బమ్‌ 60వ గ్రామీ అవార్డుల ‘వరల్డ్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌’ పోటీకి ఎంపి కైంది. ప్రసిద్ధ ఘటం విద్వాంసుడు పండిట్‌ విక్కు వినాయక్‌ రామ్‌ ఆధ్వర్యంలో మూడు తరాలకు చెందిన విద్వాంసులు పండిట్‌ విక్కు వినాయక్‌ రామ్, సెల్వగణేశ్‌ స్వామినాథన్‌ల సహకారంతో సిద్ధాంత్‌ భాటియా స్వరపరచిన ‘గురుస్తోత్రం’ అనే పాట గాత్రవాద్య విభాగంలో పోటీకి ఎంపికైనట్లు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.‘అనంత’ ఆల్బమ్‌ రికార్డింగ్‌ 33 రోజులలో పూర్తి చేశారు.

దాని రూపశిల్పి సిద్ధార్థ్‌ భాటియా దేశవ్యాప్తంగా పర్యటించి.. ఆయా ప్రాంతాల్లో సహజమైన సంగీతాన్ని అప్పటికప్పుడు రికార్డు చేశారు. సంగీతం సహజంగా జాలువారే అపురూప క్షణాలను ఒడిసిపట్టడమే లక్ష్యంగా సాగిన ఈ ఆల్బమ్‌లోని పాటలు సైతం అప్పటికప్పుడు తయారుచేసినవే. ఈ ఆల్బమ్‌ 30 మంది సంగీత దిగ్గజాల గాత్ర, స్వర సహకారంతో 300 నిమిషాల నిడివితో ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ సంగీత సంకలనంగా నిలిచింది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ బాలల విద్య, సంక్షేమ పథకాలకు వినియోగించనుంది.

త్రివేణి సంగమంలా..
ప్రేమ, భక్తి, మౌనంల త్రివేణి సంగమంలో నుంచి ఈ ఆల్బమ్‌లోని పాటలు పుట్టాయని.. సంగీత, ఆధ్యాత్మిక ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయిని ‘అనంత’ ఆవిష్కరించిందని రూపశిల్పి సిద్ధాంత్‌ భాటియా పేర్కొన్నారు. ఈ ఆల్బమ్‌లో గ్రామీ విజేతలు పండిత్‌ విక్కు వినాయక్‌రామ్‌ (ఘటం), పండిత్‌ విశ్వమోహన్‌ భట్‌ (మోహన వీణ), స్వరకర్త కళారామ్‌నాథ్, గ్రామీ అవార్డుకు గతంలో నామినేటైన యు.రాజేష్‌ (మాండలిన్‌), పండిత్‌ తేజేంద్ర నారాయణ్‌ మజుందార్‌ (సరోద్‌)ల వాద్య సంగీతాలున్నాయి.

గాత్ర సంగీతంలో ప్రముఖులైన పండిత్‌ జస్రాజ్, అరుణా సాయిరామ్, ఉస్తాద్‌ షహీద్‌ పర్వేజ్‌ ఖాన్, ఉస్తాద్‌ రషీద్‌ఖాన్, లైఫ్‌ ఆఫ్‌ పై చిత్రానికి ఆస్కార్‌ అవార్డును అందించిన బోంబే జయశ్రీల కృతులూ ఉన్నాయి. యువ కళాకారులైన పుర్బయాన్‌ ఛటర్జీ (సితార్‌), రాజేశ్‌ వైద్య (వీణ), రాకేష్‌ చౌరాసియా (వేణువు), బాలీవుడ్‌ గాయకులు హరిహరన్, కె.ఎస్‌.చిత్ర, జావేద్‌ అలీ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

మరిన్ని వార్తలు