అతి పురాతన పంచలోహ విగ్రహం స్వాధీనం

10 Oct, 2015 18:43 IST|Sakshi

చేవెళ్ల రూరల్ (రంగారెడ్డి జిల్లా) : సుమారు రూ.25 లక్షల విలువ చేసే పురాతన దేవతా పంచలోహ విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు పంపారు. చేవెళ్ల సీఐ జె.ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన శివ తాపీ మేస్త్రీ కాగా, కేఎన్ మూర్తి ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది గోదావరి పుష్కరాలకు భద్రాచలం వెళ్లగా సాగర్ అనే వ్యక్తి వారికి పరిచయం అయ్యాడు. అతడు తన వద్ద ఉన్న పంచలోహ విగ్రహాన్ని రూ.50 వేలకు విక్రయించాడు. వారు దానిని తీసుకువచ్చి నగల వ్యాపారులకు చూపించగా రూ.20 లక్షలకు పైగా విలువ ఉంటుందని చెప్పారు.

దీంతో శివ, కేఎన్‌మూర్తి పంచలోహ విగ్రహం తమ వద్ద అమ్మకానికి ఉందంటూ సన్నిహితుల వద్ద చెప్పడమే కాకుండా తెలిసిన వారికి వాట్సప్‌లో కూడా సమాచారం ఇస్తున్నారు. ఓ వ్యక్తి దానిని రూ.15 లక్షలకు కొనేందుకు బేరం కుదుర్చుకున్నాడు. ఈలోగా విషయం పోలీసులకు తెలియడంతో శుక్రవారం రాత్రి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, శివ ఇంట్లో ఉన్న రెండు కిలోల బరువుగల భవానీమాత పంచలోహ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భవానీమాత విగ్రహం అతి పురాతనమైందిగా పోలీసుల విచారణలో తేలింది. విగ్రహం పైభాగంలో నాగుపాము పడగ ఉందని, సాధారణంగా ఇటువంటి విగ్రహాలను దేవాలయాలలోనే ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని ఎక్కడైనా ఆలయం నుంచి దొంగతనం చేసుకొచ్చి తీసుకొచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విగ్రహాన్ని విక్రయించిన సాగర్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు