‘పులిచింతల’పై ఆంధ్రప్రదేశ్ కొర్రీ

18 Jan, 2015 03:18 IST|Sakshi
‘పులిచింతల’పై ఆంధ్రప్రదేశ్ కొర్రీ

 పవర్ ప్లాంట్ నిర్మాణానికి మోకాలడ్డు
 సాక్షి, హైదరాబాద్: ఒప్పందాల ప్రకారం తెలంగాణకు విద్యుత్ పంపిణీ చేసేందుకు ఇప్పటికే నిరాకరిస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కొర్రీ పెట్టింది. పులిచింతల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి మోకాలడ్డింది. రిజర్వాయర్‌లోని నీటిని ఖాళీ చేయకుండా మొండికేస్తోంది. దీంతో ఈ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్లాంటు నిర్మాణానికి సహకరించాలని, జలాశయంలోని నీటి నిల్వలను ఖాళీ చేయాలంటూ తెలంగాణ జెన్‌కో ఇప్పటికే ఏపీ నీటిపారుదల విభాగానికి లేఖ రాసినా ఏపీ అదేమీ పట్టించుకోనట్లుగా పెడచెవిన పెట్టింది.
 
 జెన్‌కో డెరైక్టర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికారుల స్థాయిలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు స్పందన లేకపోవటంతో తాజాగా టీఎస్ జెన్‌కో చైర్మన్, ఎండీ డి.ప్రభాకరరావు ఏపీ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శికి ఇదే అంశంపై లేఖ రాసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘ప్రస్తుతం పులిచింతల జలాశయం లో 13 టీఎంసీల నీరు ఉంది. మొత్తం ఖాళీ చేస్తే తప్ప ప్లాంట్ పనులు జరిగే అవకాశం లేదు. రబీ అవసరాలకు నీటిని ఖాళీ చేసి తర్వాత సాగర్ నుంచి నీటిని వాడుకోవాలని ఏపీ ఇరిగేషన్ విభాగానికి సూచించాం. కానీ అదేమీ పట్టించుకోకుండా ఏపీ సాగర్ నీటిని వాడుకుంటూ పులిచింతలను ఖాళీ చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది..’ అని జెన్‌కో అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు