పట్టిసీమలో చుక్క వాటా ఇవ్వం

1 Sep, 2017 01:46 IST|Sakshi
పట్టిసీమలో చుక్క వాటా ఇవ్వం

ఏపీ సర్కారు కొత్త మెలిక  
► పట్టిసీమ పోలవరంలో భాగమేనంటూ కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖ
► తెలంగాణే గోదావరి నుంచి కృష్ణాకు 163టీఎంసీలు మళ్లిస్తోందని వాదన  
► వాటిలో తమకు వాటా ఇవ్వాలని పేచీ  
► గోదావరి నీటిని మళ్లిస్తూ పట్టిసీమలో వాటా అడగడంపై అభ్యంతరం


సాక్షి, హైదరాబాద్‌:  కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ చిచ్చురేగేలా ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో ఎగువన ఉన్న తెలంగాణకు చుక్క నీటి వాటా దక్కదని స్పష్టం చేసింది. పోలవరంలో అంతర్భాగంగానే పట్టిసీమ చేపట్టామని స్పష్టం చేసింది. తెలంగాణనే ఎస్సారెస్పీ, వరద కాల్వ, దేవాదుల, సింగూరు ప్రాజెక్టుల ద్వారా ఏకంగా 163 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌  కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాశారు.

పాతవాదనతోనే లేఖలు
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80, పోలవరం కుడి కాలువ ద్వారా 80 వెరసి 160 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ ప్రభుత్వం కృష్ణా డెల్టాకు మళ్లిస్తోందని, గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం తమకు కృష్ణా జలాల్లో 90 టీఎంసీలు అదనంగా ఇవ్వాలని గతంలో తెలంగాణ సర్కార్‌ కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాసింది. దీనిపై స్పందించిన కృష్ణా, గోదావరి బోర్డులు వివరణ కోరుతూ జూలై 14న ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాశా యి. వీటిపై స్పందించిన ఆ ప్రభుత్వం ఇప్పటివరకూ చేస్తున్న వాదననే వినిపిస్తూ ఇటీవల రెండు బోర్డులకు లేఖలు రాసింది.  

ఆ నీటిని వాడుకుంటున్నారుగా!
‘పోలవరం ప్రాజెక్టుపై సరిహద్దు రాష్ట్రాలతో ఆగస్టు 4, 1978లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ మహారాష్ట్ర 14, కర్ణాటక 21, నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వినియోగించుకునే వెసులుబాటును కల్పిస్తూ గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఫలా లను ముందుగా అందుకోవాలన్న లక్ష్యంతోనే కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలించడానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాం.పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గ్రావిటీ ద్వారానే కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు తరలిస్తాం. ఇదే అంశాన్ని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.

అంటే పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టులు రెండు వేర్వేరు కాదన్నది స్పష్టం అవుతోంది. గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడే నాటికి కృష్ణా నదిపై జూరాల, గోదావరి ఉప నది అయిన మంజీరపై సింగూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కర్ణాటకలో భూమి ముంపునకు గురైంది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కర్ణాటకకు నష్ట పరిహారం చెల్లించింది. జూరాల, మంజీరల నిర్మా ణంలో కర్ణాటకతో సమైక్య ప్రభుత్వం కుదర్చుకున్న ఒప్పందం మేరకు పోల వరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే గోదా వరి జలాలకుగాను కృష్ణా జలాల్లో అదనపు వాటా కోరే అధికారం తెలంగాణకు లేదు.’ అని ఏపీ సర్కార్‌ తన లేఖల్లో స్పష్టం చేసింది.  

కృష్ణా జలాల్లో 163 టీఎంసీలు ఇవ్వాలి..
‘గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ సర్కార్‌ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశ ద్వారా 24, శ్రీరాంసాగర్‌ వరద కాలువ ద్వారా 6.6 టీఎంసీలు, దేవాదుల ఎత్తిపోతల ద్వారా 20.6, ప్రాణహిత–చేవెళ్ల(మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు) ద్వారా 78, సీతారామ ఎత్తిపోతల ద్వారా 22, మంజీర, ఎల్లంపల్లి ద్వారా 8.1, సింగూరు ద్వారా 4 మొత్తంగా 163 టీఎంసీల జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పులో 14(బీ) క్లాజ్‌ ప్రకారం తెలంగాణ సర్కార్‌ కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లించిన 163 టీఎంసీల గోదావరి నీళ్లల్లో అదే స్థాయిలో మాకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలి’అని తన లేఖల్లో ఏపీ సర్కార్‌ స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు