సింగరేణిలో రాష్ట్ర వాటా తెలంగాణకు..

8 May, 2014 01:45 IST|Sakshi
సింగరేణిలో రాష్ట్ర వాటా తెలంగాణకు..

* అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 51 శాతం వాటా తెలంగాణకు బదీలీ చేస్తూ ఉత్తర్వులు
* ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రత్యేక కమిటీ
సింగరేణి అనుబంధ సంస్థ ‘అప్మెల్’ పరిస్థితి ఏమిటి?

 
 కొత్తగూడెం, న్యూస్‌లైన్:
ప్రస్తుత అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు సింగరేణిలో ఉన్న 51 శాతం రాష్ట్ర వాటాను తెలంగాణ రాష్ట్రానికి బదిలీచేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ప్రత్యేక కమిటీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో నం. 123 ద్వారా సింగరేణి సంస్థపై పూర్తి అధికారాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
 ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థకు గోదావరి నది పరీవాహక ప్రాంతంలో 350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 8,791 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ప్రస్తుతం సింగరేణి సంస్థ 15 ఓపెన్ కాస్ట్‌లు, 34 భూగర్భ గనుల ద్వారా ఏటా దాదాపు 50 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును వెలికితీస్తోంది. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న గనుల్లో 62,805 మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉన్నాయి.
 
 విద్యుత్ రంగంలోనూ...
 సింగరేణి బొగ్గు ఉత్పత్తి మాత్రమేగాకుండా.. విద్యుత్ రంగంపైనా దృష్టి సారించింది. ఆదిలాబాద్‌లో 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. మరో ఆరునెలల్లో ఈ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు 50:50 శాతం ఈక్విటీతో ఎన్టీపీసీతో కలిసి ఎస్‌సీసీఎల్, ఎన్టీపీసీ గ్లోబల్ కన్‌స్ట్రక్షన్స్, 49:51 శాతం ఈక్విటీతో ఏపీఎండీసీ సంస్థతో కలిసి సూరియాలి కోల్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ప్రస్తుతం సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 66 శాతం బొగ్గును విద్యుత్ రంగ సంస్థలకు అందిస్తోంది.
 
 సిమెంట్ పరిశ్రమలకు 13.5 శాతం, క్యాప్టివ్ పవర్‌కు 6.6, స్పాంజ్ ఐరన్ యూనిట్లకు 3.1, ఇతరులకు 10.8 శాతం బొగ్గు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం సింగరేణి నుంచి ఎన్టీపీసీ రామగుండం, ఏపీ జెన్‌కో కేంద్రాలు, కర్ణాటక పవర్ కార్పొరేషన్, మహారాష్ట్రకు చెందిన మహా జెన్‌కో తదితర కేంద్రాలకు బొగ్గు సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడే నూతన ప్రభుత్వం బొగ్గు సరఫరాపై కొత్త ఒప్పందాలు చేసుకునేలా పునర్విభజన కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
 
 అప్మెల్ పరిస్థితి ఏమిటి..?
 సంస్థకు అవసరమైన పరికరాలు తయారు చేసేందుకు విజయవాడ కేంద్రంగా అప్మెల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్) యూనిట్‌ను సింగరేణి నిర్వహిస్తోంది. ఈ సంస్థకు రూ. 500 కోట్ల మేరకు ఆస్తులు న్నాయి. అయితే ఈ అప్మెల్ ఆస్తులపై ఎలాంటి ప్రస్తావన జీవోలో లేకపోవడం గమనార్హం. అప్మెల్ ఆస్తులు సింగరేణి సంస్థకు వస్తాయా..? లేక సీమాంధ్రకు ఇస్తారా..? అనే విషయంపై స్పష్టత లేదు. అప్మెల్ సంస్థ విజయవాడలో ఉన్నందున దీని గురించి ప్రస్తావించలేదని.. అయితే సింగరేణితోపాటు ఆ సంస్థ కూడా తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని సింగరేణి అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు