ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజన షురూ

7 Jun, 2018 04:02 IST|Sakshi

ఏపీకి 58% తెలంగాణకు 42%

నగదు భారం లేకుండా పంచుకుందాం

రెండు రాష్ట్రాల అంగీకారం

సాక్షి,హైదరాబాద్‌: ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్‌ విభజన ప్రక్రియ మొదలైంది. నగదు భారం పడకుండా ఏపీ భవన్‌ను 58:42 లో పంచునేందుకు ఏపీ, తెలంగాణ  రాష్ట్రా లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. సచివాలయం లో బుధవారం జరిగిన రెండు రాష్ట్రాల విభజన విభా గం అధికారుల తొలి భేటీలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ నుంచి విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

జనాభా నిష్పత్తి ప్రకారమే పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఏపీ భవన్‌కు 19.437 ఎకరాల భూములున్నాయి. ఇందులో 3.73 ఎకరాల్లో శబరి బ్లాక్, 4.196 ఎకరాల్లో గోదావరి –స్వర్ణముఖి బ్లాకులతో పాటు ఏపీ సీఎం కాటేజీ ప్రాంగణం, 3.412 ఎకరాల్లో ఓల్డ్‌ నర్సింగ్‌ హాస్టల్, 7.564 ఎకరాల్లో పటౌడీహౌస్‌ ఉన్నాయి. మధ్యలో 0.535 ఎకరాల మేర సర్వీసు రోడ్డు ఉంది. విభజన చట్టం ప్రకారం ఈ ఆస్తులన్నీ రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ప్రకారం ఏపీ 58%, తెలంగాణ 42% నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది.

ఇప్పటికే కేంద్ర హోంశాఖ సూచనలమేర పంచుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పంపిణీపై అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఏపీ భవన్‌ తెలంగాణకే చెందుతుందని గతంలో సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్రం పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి భవన్‌ను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని గతేడాది మార్చిలోనే సూచించింది.

మరిన్ని వార్తలు