సెటిలర్లు టీఆర్‌ఎస్‌ వైపే!

11 Dec, 2018 14:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రా సెటిలర్లు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నట్లు ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌లోని దాదాపు 20 నియోజకవర్గాల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ సమైక్య రాష్ట్రాన్ని విడదీసిందన్న కోపం సెటిలర్ల మనసులో ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. ఎటువంటి రక్తపాతం జరగకుండా తెలంగాణాను తీసుకువచ్చిన టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే సెటిలర్లపై దాడులు జరుగుతాయన్న దుష్ప్రచారాన్ని పఠాపంచలు చేస్తూ పరిపాలించారు. కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సెటిలర్లపై దాడులు చేయలేదు. చేసే అవకాశం కూడా సృష్టించలేదు.

తెలంగాణాలో నివాసం ఉన్నవాళ్లందరూ తెలంగాణా వారే అన్న భద్రతను సెటిలర్లలో కల్పించగలిగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా సెటిలర్ల మనసుల్ని గెలిచుకున్నాయనుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, రైతు బంధు పథకాలు సెటిలర్లతో పాటు ఇక్కడి ప్రజల్ని కూడా ఆకట్టుకున్నాయి. ఎలాంటి ప్రాంతీయ వివక్ష లేకుండా తెలంగాణాలోని సెటిలర్లకు ఇక్కడి వారితో సమానంగా ఈ పథకాలు అందించడంతో టీఆర్‌ఎస్ పాలనపై మక్కువ పెరిగింది. చంద్రబాబు నాయుడు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టకపోవడం,  ఆంధ్రాలో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయలతో కొని టీడీపీలో చేర్చుకోవడం.. ఇదే విషయంలో తెలంగాణ టీడీపీలో గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను ఓడించాలని ఈ ఎన్నికలలో పిలుపునివ్వడం.. కాంగ్రెస్‌తో కలవడం కూడా సెటిలర్లకు నచ్చినట్లుగా కనపడటం లేదు.

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అధికారం కుక్కలు చింపిన విస్తరాకులా తయారవుతుందని భావించి సెటిలర్లు కూడా టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల తర్వాత సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, భువనగిరి, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, నల్గొండ, బాన్సువాడ, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, పాలేరు, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాల్లో సెటిలర్లు పెద్ద సంఖ్యలో​ఉంటారు. వీరి ఓట్ల ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. హుజూర్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, పాలేరు, సత్తుపల్లి తప్పితే మిగతా అన్నిచోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 2014 కంటే మెజార్టీతో గెలిచినట్లు ఫలితాల ద్వారా తెలుస్తోంది. మరో 10 నియోజకవర్గాల్లో కూడా సెటిలర్లు పాక్షికంగా ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్నారు. అయితే వీరంతా కూడా ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే జై కొట్టినట్లు కనపడుతోంది.

మరిన్ని వార్తలు