‘మిర్యాల’లో ఆంధ్రా ఓటర్లు..!

5 Jul, 2019 07:00 IST|Sakshi
ఇందిరమ్మ కాలనీలో ఓటరు జాబితాలో ఉన్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి ఓట్లు

తప్పుడు  అడ్రస్‌లతో ఓటర్లుగా నమోదు

విచారణ జరపకుండానే ఓటు హక్కు కల్పించిన అధికారులు

సాక్షి, మిర్యాలగూడ : ఓటర్ల జాబితా తప్పుల తడకలుగా ఉన్నాయి. తప్పుడు అడ్రస్‌లతో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. కాగా అధికారులు కనీసం విచారణ కూడా చేయకుండా దరఖాస్తులు చేసుకున్న వారందరికీ ఓటు హక్కు కల్పించారు. దీనిలో భాగంగానే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి కూడా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఓటు హక్కు కల్పించారు. ఈ ఓట్లను గతంలో శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా మార్పులు, చేర్పులతో పాటు కొత్త ఓట్ల నమోదు సమయంలో చేర్పించారు. కానీ స్థానికులు వాటిని గుర్తించకపోవడం వల్ల అధికారులకు ఫిర్యాదులు చేయలేకపోయారు.

కానీ ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆశావహులు ఓటర్ల జాబితాను పరిశీలించడంతో నకిలీ ఓట్లు బయటపడుతున్నాయి. మిర్యాలగూడ మున్సిపాలిటీలో గతంలో 36 వార్డులు ఉండగా ప్రస్తుతం వాటిని 48 వార్డులుగా విభజించారు. కాగా అన్ని వార్డుల్లో మొత్తం 88 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా 85,709 మంది ఓటర్లు ఉన్నారు. 

ఒకే వార్డులో వందకు పైగా ఆంధ్రా ఓటర్లు
మిర్యాలగూడ మున్సిపాలిటీలోని పునర్విభజన ప్రకారం చింతపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీని 22 వార్డుగా ఏర్పాటు చేశారు. కాగా అక్కడ 107, 108 పోలింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. ఆ వార్డులో మొత్తం 1,650 ఓట్లు ఉన్నాయి. కాగా ఈ వార్డులోనే 170 ఓట్లు నకిలీ ఓట్లు నమోదయ్యాయి. వాటిలో వంద ఓట్లు పైగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారివి ఉండటం గమనార్హం. ఓటరు క్రమ సంఖ్య 550 నుంచి 587 వరకు ఆంధ్రా ప్రాంతం మాచర్లకు చెందిన వారి ఓట్లు ఉన్నాయి. అంతే కాకుండా ఒకే ఇంటినంబర్లలో పది మంది ఓట్లు, ఇంటికి బై నంబర్లు వేసి ఓటు హక్కు పొందారు. ఇందిరమ్మ కాలనీలో 34–364కు బై నంబర్లు వేసి ఓటర్లుగా నమోదు చేశారు. 

ఆర్డీఓకు స్థానికుల ఫిర్యాదు 
ఇందిరమ్మ కాలనీలోని 107, 108 పోలింగ్‌ స్టేషన్లలో సుమారుగా 170 ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయి. స్థానికేతరులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని స్థానికులు ఆర్డీఓ జగన్నాథరావుకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రా ప్రాంతం మాచర్లకు చెందిన వారి ఓట్లు ఉన్నాయని, అధికారులు విచారణ చేయకుండా ఓటు హక్కు కల్పించినట్లు ఆరోపించారు. కాగా స్థానికుల ఫిర్యాదు మేరకు ఇందిరమ్మ కాలనీలో విచార చేపట్టి నకిలీ ఓట్లు ఉంటే తొలగిస్తామని ఆర్డీఓ జగన్నాథరావు స్థానికులకు హామీ ఇచ్చారు.   

మరిన్ని వార్తలు