ఇంటి వద్దకే అంగన్‌వాడీ సరుకులు

24 Mar, 2020 04:00 IST|Sakshi

కేంద్రాల మూతతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు

కరోనాపై అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు అప్రమత్తంగా ఉండాలి

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను మూసేస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రకటించారు. అయినప్పటికీ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పౌష్టికాహార పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోమవారం హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులు పంపిణీని గ్రామ కమిటీ ద్వారా చేపట్టాలన్నారు. ఈ కమిటీలో అంగన్‌వాడీ టీచర్, హెల్పర్, గ్రామ కార్యదర్శి, ఆశ వర్కర్, స్థానిక పోలీస్‌ను భాగస్వామ్యం చేసి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతి వస్తువు సరైన పద్ధతిలో, సరైన సమయంలో లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ దివ్యను ఆదేశించారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితి నేపథ్యంలో సెలవు రోజుల్లో కూడా రోజు మాదిరిగానే సరుకులు పంపిణీ చేయాలన్నారు. కరోనాపై అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు అప్రమత్తంగా ఉండాలని, విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు.

గర్భిణుల జాబితా సిద్ధం చేయాలి..: గ్రామాలు, పట్టణాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ప్రసవ సమయానికి సిద్ధమైన గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని మంత్రి సత్యవతి ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో గర్భిణులు 3.3 లక్షలు ఆరోగ్య లక్ష్మి ద్వారా లబ్ధి పొందుతున్నారని కమిషనర్‌ దివ్య వివరించారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు బాలబాలికలు 4.40 లక్షలు, 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు శిశువులు 8.40 లక్షల మంది ఉన్నారన్నారు.

మరిన్ని వార్తలు