ఇరుకు.. బెరుకు..! 

14 Feb, 2019 06:58 IST|Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: అద్దె భవనాలు.. అసంపూర్తి నిర్మాణాలు.. అరకొర సౌకర్యాలు.. కరువైన ఆట స్థలాలు.. ఇలా నెట్టుకొస్తున్నాయి జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలు. సొంత భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. పలు సమస్యల కారణంగా నిర్మాణాలు పూర్తి కాలేదు. అద్దె భవనాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఒకింత అసౌకర్యానికి గురవుతున్నారు. ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న కేంద్రాలకు భయం భయంగా వెళుతూ ఇబ్బంది పడుతున్నారు. కొందరు కేంద్రాలకు వెళ్లకుండానే పౌష్టికాహారం ఇళ్లకు తీసుకెళ్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
 
జిల్లాలోని 7 ప్రాజెక్టుల కింద మొత్తం 1,896 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో ప్రధాన కేంద్రాలు 1,605, ఉప కేంద్రాలు 291 ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడేళ్ల పిల్లలు 39,864, 3 నుంచి ఆరేళ్ల మధ్య పిల్లలు 30,991 మంది ఉండగా.. గర్భిణులు, బాలింతలు 19,583 మంది ఉన్నారు. 1,896 అంగన్‌వాడీ కేంద్రాలకుగాను.. 869 కేంద్రాలకే సొంత భవనాలున్నాయి. మిగిలిన కేంద్రాలన్నీ అద్దె భవనాల్లో.. అరకొర సౌకర్యాల మధ్య నడుస్తున్నాయి. ఇలా నిర్వహించడం వల్ల అనుకూలంగా ఉండడం లేదంటూ..పిల్లల తల్లిదండ్రులు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతోచాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదు. 

పక్కా భవనాలు లేక ఇబ్బందులు..  
అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణతో అనేక సమస్యలు నెలకొన్నాయి. జిల్లాలో మొత్తం 1,896 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. వాటిలో 869 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 510 కేంద్రాల్లో ఆయా గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో ఒక గది తీసుకొని కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఇక 517 కేంద్రాలు అద్దె భవనాల్లో అసౌకర్యాల నడుమ నడుస్తున్నాయి. ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నప్పటికీ వాటిని అందించే కేంద్రాల్లో మాత్రం సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి.

పిల్లలకు పౌష్టికాహారంతోపాటు చదువు చెప్పడం.. ఆటలు ఆడించడం.. నిద్రపుచ్చడం వంటివి చేయాల్సి ఉంది. అయితే అద్దె భవనాల్లోనే అత్యధిక కేంద్రాలను నిర్వహిస్తుండడంతో నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. అర్బన్‌ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు భవనం చుట్టుపక్కల ఖాళీ ప్రదేశం లేకపోవడం, చిన్నచిన్న ఇరుకు గదులు కావడంతో పిల్లలు ఉండలేని పరిస్థితి నెలకొంది. మంచినీరు కూడా దొరకని పరిస్థితి. నీటి వసతి లేక ఆయాలు కేంద్రం బయటకు వెళ్లి నీటిని తేవాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రెండు మూడు రోజులకోసారి నీటిని పట్టుకొని నిల్వ చేసుకుని వాడాల్సి వస్తోందని ఆయాలు వాపోతున్నారు.
 
భవనాలు మంజూరైనా.. 
జిల్లాలో అద్దె భవనాల్లో నిర్వహించే అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ నిర్మాణాలకు మోక్షం కలగడం లేదు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాల అవరణలో నిర్వహించాలని, ఆవరణలోనే కేంద్ర భవనాన్ని నిర్మించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం సైతం ప్రాథమిక పాఠశాలల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించాలని సూచించి, ఉపాధిహామీ కింద కొన్ని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా మరికొన్ని నిధులను విడుదల చేసింది.

అయితే పలు కారణాలతో పాఠశాలల్లో భవనాలను నిర్మించలేకపోతున్నారు. విద్యా శాఖ అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించేందుకు పాఠశాలల్లో స్థలాలను చూపించకపోవడంతో భవన నిర్మాణాలు ముందుకు సాగట్లేదు. కాగా.. పాలేరు నియోజకవర్గంలో ఏళ్ల కిందటే 89 అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించేందుకు అధికారులు స్థలం చూపించడం, నిర్మాణ పనులకు అవసరమైన అనుమతులను మంజూరు చేసినప్పటికీ వాటి నిర్మాణం ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. స్థలం కోసం ఎదురుచూసిన అధికారులకు భవన నిర్మాణ పనులు ప్రారంభిద్దాం అనుకునే సమయానికి ఎన్నికల కోడ్‌ వచ్చింది. దీంతో నియోజకవర్గంలో ఒకటి రెండు భవనాలు మినహా మిగతా భవనాల నిర్మాణం ఆగిపోయింది. ఇకనైనా అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.  
 
భవనాలు మంజూరయ్యాయి.. 
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. స్థలం కోసం స్థానిక ప్రాథమిక పాఠశాలలకు లేఖలు పెట్టాం. పాలేరు నియోజకవర్గంలో 89 భవనాలు మంజూరు కాగా.. వాటన్నింటికీ స్థల సేకరణ చేశాం. త్వరలోనే నిర్మాణాలు పూర్తి చేస్తాం. మధిర నియోజకవర్గంలో 100 భవనాలు మంజూరయ్యాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే స్థల సేకరణ జరిగింది. మిగిలిన వాటికి కూడా త్వరలోనే స్థలాన్ని చూసి నిర్మిస్తాం. వేదాంత భవనాలు నిర్మించేందుకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటిని త్వరలోనే నిర్మిస్తాం. ఎన్నికల కోడ్‌ వల్ల భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.  – వరలక్ష్మి, ఐసీడీఎస్‌ పీడీ

మరిన్ని వార్తలు