మరింత పక్కాగా..  

1 Feb, 2019 07:11 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహార పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో ప్రస్తుతం అక్రమాలు అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏజెన్సీలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి బియ్యం, పప్పులు, నూనె, గుడ్లు, రవ్వ తదితర వస్తువులను చౌకధర దుకాణాల ద్వారా నేరుగా అందించాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఫిబ్రవరి నెలకు సంబంధించి బియ్యాన్ని డీలర్ల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించున్నారు.

అక్రమాలకు అడ్డుకట్ట 
అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు మరింత పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి అవసరమైన సరుకులను ప్రస్తుతం అందిస్తున్నట్లు ఏజెన్సీల ద్వారా కాకుండా చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ఫిబ్రవరి నెల నుంచే అమలుకానుంది.

గతంలోనే అనుకున్నా.... 
గతంలోనే అంగన్‌వాడీ కేంద్రాలకు రేషన్‌షాపుల ద్వారా సరుకులు అందజేయాలని ప్రభుత్వం యోచించినా అమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈనెల ఈ పద్ధతి అమల్లోకి రానుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు చదువు నేర్పిస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అలాగే, ఆయా కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలకు ఒకపూట సంపూర్ణ భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు బాలింతలకు అదనంగా నిత్యం ఒక గుడ్డు, 200 మిల్లిలీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఏజెన్సీల ద్వారా ఈ సరుకులు అందజేసే వారు. అయితే పంపిణీలో అక్రమాలు, అవకతవకలను గుర్తించిన ప్రభుత్వం నేరుగా పౌరసరఫరాల శాఖ ద్వారా చౌకధర దుకాణాల నుంచి అందించాలని నిర్ణయించింది.

జిల్లాలో 1,889 అంగన్‌వాడీ కేంద్రాలు... 
జిల్లాలోని 26 మండలాల్లో 1,889 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఐసీడీఎస్‌ పరిధిలో మహబూబ్‌నగర్‌ అర్బన్, మహబూబ్‌నగర్‌ రూరల్, దేవరకద్ర, మద్దూరు, మక్తల్, జడ్చర్ల, నారాయణపేట ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ద్వారా ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలకు పాఠశాల పూర్వ విద్య బోధిస్తున్నారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతీనెలా 3663.53 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. ఇంతకాలం ఇస్తున్నట్లు ఏజెన్సీల ద్వారా కాకుండా సమీపంలోని రేషన్‌ దుకాణాల ద్వారా అవసరమైన అన్ని సరుకులను అందజేయాలని నిర్ణయించారు. సరుకుల్లో బియ్యంతో పాటు మంచినూనె, పప్పు తదితర నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వాలని నిర్ణయించినా మొదటగా బియ్యం మాత్రమే ఇవ్వనున్నారు. బియ్యం పంపిణీ సజావుగా జరిగితే మిగతా సరుకులను సైతం ఈ విధానంలోనే అంగన్‌వాడీలకు అందచేస్తారు. ప్రతినెలా ఏ కేంద్రంలో ఎందరు పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఉంటే ఇండెంట్‌ ప్రకారం సరుకులను తీసుకెళ్లడానికి సులువుగా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

1నుంచి 15వ తేదీ వరకు... 
చౌకధర దుకాణాల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీలోగా సరఫరా చేయాలని నిర్ణయించారు. దీంతో గోదాముల నుంచి, ఏజెన్సీల ద్వారా బియ్యం పంపిణీ చేసినప్పుడు తూకంలో తేడా ఉందంటూ వచ్చే ఆరోపణలకు చెక్‌ పడనుంది. కాగా, అంగన్‌వాడీ కేంద్రాల్లో వినియోగించిన బియ్యానికి సంబంధించిన ప్రతినెల 8వ తేదీలోపు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆ తర్వాత నెల బియ్యం సరఫరా చేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న చౌకధర దుకాణాల వివరాలను ఇప్పటికే ఐసీడీఎస్‌ అధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. కేంద్రాల వారీగా సరఫరా చేయాల్సిన బియ్యం కోసం పౌరసరఫరాల శాఖ అధికారులకు నివేదించారు. అంగన్‌వాడీ టీచర్లు ప్రతినెల బయోమెట్రిక్‌ విధానం ద్వారా కేంద్రానికి అవసరమయ్యే బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది.

నేడు ప్రారంభించనున్న కలెక్టర్‌ 
చౌకధరల దుకాణాల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ విధానాన్ని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ శుక్రవారం ప్రారంభించనున్నారు. నారాయణపేటలోని 7వ వార్డు పరిధిలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌–2కు కలెక్టర్‌ బియ్యం అందజేస్తారు. ఇక మిగతా కేంద్రాల్లో కూడా అధికారులు బియ్యం పంపిణీని ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు