కేంద్రం కానుక

15 Sep, 2018 15:32 IST|Sakshi
గద్వాలలోని ‘కంటివెలుగు’ శిబిరంలో వివరాలు నమోదు చేసుకుంటున్న ఆశా కార్యకర్తలు

గద్వాల న్యూటౌన్‌/ గద్వాల అర్బన్‌: ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతో వారు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరికి ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రైమ్‌ మినిస్టర్‌ సురక్షా బీమా యోజన కింద రూ.నాలుగు లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 1న ఆశా కార్యకర్తల వేతనం రూ.7,500కు పెంచింది. ఇందుకు సం బంధించిన జీఓ 509 సైతం జారీ చేసింది. దీనికితోడు తాజాగా కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం మరో రూ.1,500 పెంచుతున్నట్టు  ప్రకటించింది. కాగా, గ్రామీణస్థాయిలో అమలు చేసే ఆరోగ్య సేవలకు ఆశా కార్యకర్తలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఆరోగ్య కార్యక్రమం వీరి ద్వారానే ఆరంభమవుతుంది. జిల్లాలో ప్రతి వేయి జనాభాకు ఒకరు చొప్పున నియమితులయ్యారు.

ప్రధానంగా మూడు రకాల సేవలు అందిస్తున్నారు. ఇందులో మొదటిది మాతా, శిశు సంరక్షణ సేవలు. అర్హులైన దంపతులను గుర్తించడం, వారి వివరాలు సేకరించడం.. కుటుంబ నియంత్రణ (తాత్కాలిక) పద్ధతులను తెలియజేయడం.. గర్భిణులను గుర్తించి రిజిస్ట్రేషన్‌ చేయించడం.. వారికి సేవలందించడం.. వైద్యులతో పరీక్షింపజేయడం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిపించుకునేలా చేయడం.. శిశువులకు ఇమ్యునైజేషన్‌ ఇప్పించడం.. తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇక రెండో సేవల్లో భాగంగా సంక్రమిక వ్యాధులైన టీబీ, కుష్ఠు, మలేరియా తదితర వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్‌సీ) నికి తీసుకెళ్లి చికిత్సలు చేయించడం, వారు క్రమంతప్పకుండా మందులు వాడేలా చూస్తారు. దీంతోపాటు వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తారు. మూడో విధుల్లో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో వీరి పాత్ర తప్పనిసరిగా ఉంటుంది.

ఇన్ని పనులు చేస్తున్నా ఏడాదిన్నర క్రితం వరకు కేవలం రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలు మాత్రమే పొందేవారు. దీంతో గౌరవ వేతనాలు పెంచాలంటూ అనేక రూపాల్లో ఉద్యమించారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ఏడాది మే నుంచి రూ.ఆరు వేలకు పెంచింది. ఇది ఏమాత్రం సరిపోదని అప్పట్లో ఆశా కార్యకర్తలు విన్నవించారు. చివరకు ఈనెల 1న రూ.7,500కు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ వేతనాన్ని ఆశా కార్యకర్తలు అక్టోబర్‌ నుంచి తీసుకోనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వమూ రూ.1,500 పెంచడంతో నవంబర్‌ నుంచి రూ.తొమ్మిది వేలు అందుకోనున్నారు.

3 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో..
ఇక జిల్లాలో గద్వాల అర్బన్, మల్దకల్, మానవపాడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని 708 కేంద్రాలకుగాను 696మంది అంగన్‌వాడీ టీచర్లు, 691మంది ఆయాలు పని చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్లకు రూ.10,500 వేతనం చెల్లిస్తుండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.మూడు వేలు, రాష్ట్రం రూ.7,500 చెల్లిస్తున్నాయి. ఆయాలకు ఇస్తున్న రూ.ఆరు వేలలో కేంద్రం వాటా రూ.1,500, రాష్ట్రం రూ.4,500 చెల్లిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం వచ్చే నెల నుంచి టీచర్లకు రూ.1,500, ఆయాలకు రూ.750 పెంచడంతో నవంబర్‌ 1న టీచర్లు రూ.12వేలు, ఆయాలు రూ.7,500 తీసుకోనున్నారు.
 
నిరాశలో అంగన్‌వాడీలు.. 
మరోవైపు పనికి తగ్గ వేతనం రావడం లేదని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాల అమలు, పెన్షన్, రిటైర్‌మెంట్‌ తర్వాత పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, కేంద్రాల నిర్వహణను ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించొద్దని, జీఓ నం.19 రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇదే విషయమై ఈనెల 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్దకు తరలివెళ్లి తమ వాణిని వినిపించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ, రికార్డుల నిర్వహణ, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, బీఎల్‌ఓలుగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. 

ఎంతో సంతోషంగా ఉంది
మా వేతనాలను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,500 పెంచు తూ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న మమ్మల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం హర్షదాయకం.    – సునీత, జిల్లా ఉపాధ్యక్షురాలు, ఆశా కార్యకర్తల సంఘం 

కనీస వేతనాలు అమలు చేయాలి 
ఏ ప్రభుత్వ పథకం వచ్చినా లబ్ధిదారులకు చేరాలంటే మేమే ప్రచారం నిర్వహిం చాలి. ఎన్నికల విధుల్లోనూ మమ్మల్ని భాగస్వాములుగా చేస్తున్నారు. కానీ కనీస వేతనం దక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం రూ.750 నుంచి రూ.1,500 వరకు పెంచడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పటిౖMðనా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెన్షన్‌ సౌకర్యం కల్పించాలి. – ఎమేలమ్మ, జిల్లా కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

మరిన్ని వార్తలు