రైతులపై వరాల జల్లు

2 Feb, 2019 12:09 IST|Sakshi

కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిసింది. ముఖ్యంగా రైతులకు అగ్ర తాంబూలం ఇచ్చారు. పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో ఏడాదికి ఆరు వేల రూపాయలు అందజేసేందుకు ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ని ప్రవేశపెట్టింది. దీనికితోడు పంట రుణాలపై రెండు శాతం వడ్డీ మాఫీని ప్రకటించింది. అంగన్‌వాడీల వేతనాలను యాభై శాతం పెంచాలనే నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులకు రూ.3 వేల పింఛన్‌ ఇవ్వడానికి ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌’ స్కీంను ప్రవేశపెట్టారు. వేతనజీవులకు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇస్తుండటంతో వారికి మరింత మేలు చేకూరనుంది.

సాక్షి, మెదక్‌: పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులపై వరాలు కురిపించింది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేల ఆర్థిక సహాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే రైతు బంధు పథకం అమలు చేస్తుండగా కేంద్రం ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6వేలు అందనున్నాయి. ఈ పథకం ద్వారా  జిల్లాలోని 2,03,788 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.122.27 కోట్ల నిధులు మూడు విడతల్లో జమ కానున్నాయి. ఈ పథకం 1 డిసెంబర్‌ 2018 నుంచి అమలులోకి రానుంది.  జిల్లాలో మొత్తం 2,18,747 మంది రైతులు ఉన్నారు. వీరిలో 2.5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్నకారు రైతులు 51,885 మంది ఉన్నారు. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలోపు వ్యవసాయ సాగుభూమి ఉన్న సన్నకారు రైతులు 1,51,903 మంది ఉన్నారు.

ఐదు ఎకరాలలోపు వ్యవసాయసాగు భూమి ఉన్న 2,03,788 మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద లబ్ధి చేకూరనుంది. ఏడాదికి రూ.6వేల చొప్పున జిల్లాలోని 2,03,788 మంది రైతులకు రూ.122.27 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. తొలి విడత ఆర్థిక సహాయం రూ.40.75 కోట్లు మార్చిలోపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎకరాను యూనిట్‌గా తీసుకుని ఆర్థిక సహాయం ప్రకటిస్తే రైతులకు మరింత మేలు జరిగేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంతో రైతులకు అప్పుల తిప్పలు తప్పటంతోపాటు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంది. అలాగే జిల్లాలో పంటరుణాలపై 2 శాతం వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.

జిల్లాలో ఏటా లక్ష మందికిపైగా రైతులు రుణాలు తీసుకుంటున్నారు. వీరిలో సగానికిపైగా రైతులు సకాలంలో రుణాలు చెల్లించటం జరుగుతుంది. దీంతో 50వేల మంది రైతులకు 2 శాతం వడ్డీ మాఫీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ ద్వారా గోవుల ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోనుంది.  మత్స్యకార్మికులు కిసాన్‌ క్రెడిట్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపితే 2 శాతం వడ్డీ మాఫీ ప్రకటించింది. ఇదికూడా జిల్లాలోని మత్సకార్మికులకు లాభం చేకూర్చనుంది.

ఆనందంలో అంగన్‌వాడీలు
కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్ల వేతనం 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 865 మంది అంగన్‌వాడీ ఉద్యోగులకు వేతనం పెరగనుంది. జిల్లాలో మొత్తం 885 అంగన్‌వాడీలు ఉండగా వీటిలో 865 మంది అంగన్‌వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరికి రూ.10,500 వేతనం అందుతుంది. ఇందులో కేంద్రం వాటా రూ.4500 కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.6వేల తనవాటాగా చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం పెంచి తన వాటాగా ఉద్యోగులకు ఇకపై రూ.6750 చెల్లించనుంది. దీంతో అంగన్‌వాడీలకు ఇకపై ప్రతినెలా రూ.12,750 వేతనం అందనుంది.

అసంఘటిత రంగ కార్మికులకు మేలు 
కేంద్రం అసంఘటిత రంగ కార్మికులకు వరం ప్రకటించింది. 60 ఏళ్ల వయస్సుదాటిన వారికి ప్రతినెలా రూ.3వేల పింఛన్‌ ఇవ్వనున్నట్లు బడ్జెట్‌లో తెలిపింది. ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌’ పేరిట అసంఘటిత రంగ కార్మికులకు రూ.3 వేల పింఛన్‌ ఇస్తుంది. ఇందుకోసం రూ.15వేల లోపు ఆదాయం ఉన్న అసంఘటితరంగ కార్మికుల నుంచి ప్రతినెలా రూ.100 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.  జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 4,300 మంది అసంఘటితరంగ కార్మికులు ఉన్నారు. వీరందిరికీ పింఛన్‌ పథకం వర్తిసుంది. అయితే జిల్లాలో పదివేల మందికిపైగా అసంఘటితరంగ కార్మికులు ఉన్నట్లు అంచనా. సర్వే చేసి వీరి పేర్లను నూతన పథకంలో చేర్చాలని సీఐటీయూ నేతలు కోరుతున్నారు.

పన్ను మినహాయింపు.. 
వేతన జీవులకు కేంద్రం బడ్జెట్‌లో ఊరటనిచ్చే ప్రకటన చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయింపు ప్రకటించింది. ఈ నిర్ణయంతో  జిల్లాలోని 1,500 మంది ఉద్యోగులకు మేలు జరనుంది. మెదక్‌ జిల్లాలో మొత్తం 6,400 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 1500 మంది ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉన్నారు. కేంద్రం నిర్ణయంతో వీరందరికీ మేలు జరనుంది.  

మరిన్ని వార్తలు