బతికుండగానే చంపేస్తున్నారు!

27 Jul, 2015 00:50 IST|Sakshi
బతికుండగానే చంపేస్తున్నారు!

- హెచ్‌ఐవీ రోగుల ఆవేదన
- చికిత్సకోసం వెళితే చిత్రవధ చేస్తున్నారని నిట్టూర్పు
- కింగ్‌కోఠి మెడికల్ ఆఫీసర్ తీరుపై అసహనం
- ఇతర సెంటర్లకు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్న వైనం    
సాక్షి, సిటీబ్యూరో:
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హెచ్‌ఐవీ (ఎయిడ్స్) రోగులకు ఆదరణ కరువైంది. ఓ వైపు సకాలంలో మందులు అందక ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు చికిత్స కోసం వెళ్లిన వీరిని వైద్యుల తీరు మరింత కుంగిపోయేలా చేస్తోంది. ఆప్యాయంగా పలకరించాల్సిన ఏఆర్‌టీ(యాంటీ రెట్రల్ వైరల్ సెంటర్) మెడికల్ ఆఫీసర్లు తమ సూటిపోటి మాటలతో మనోవేదనకు గురి చేస్తున్నారు. దీంతో రోగులు చావడానికైనా సిద్ధపడుతున్నారు కానీ.. చికిత్సకు వెళ్లేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు.

నగరంలో సుమారు లక్ష మంది వరకు హెచ్‌ఐవీ బాధితులు ఉండగా, వీరి కోసం గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రులలో ఏఆర్‌టీ సెంటర్లు ఏర్పాటు చేశారు. చికిత్స కోసం ఆయా కేంద్రాలకు వెళ్తున్న వీరికి అక్కడి సిబ్బంది తమ మాటలతో బతికుండగానే నరకం చూపిస్తున్నారు.  
 
140 మంది రోగులు బదిలీ...
కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి ఏఆర్‌టీ సెంటర్‌లో 2,900 మంది రోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో సీడీ4 కౌంట్ 350 కన్న తక్కువ ఉన్న వారు 1,250 మంది వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా సీడీ4 కౌంట్ పరీక్ష చేసి, మందులు సరఫరా చేస్తారు. ఇక్కడ పని చేస్తున్న మెడికల్ ఆఫీసర్ తీరుతో వీరంతా మానసిక క్షోభకు గురవుతున్నారు. దీంతో ఇక తాముఈ సెంటర్‌కు రాలేమని, వేరే సెంటర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరుతున్నారు. ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది సైతం తమకు బదిలీ కావాలని వేడుకుంటున్నారు.

ఇలా ఇప్పటికే సుమారు 140 మంది రోగులు ఇక్కడి నుంచి వేరే సెంటర్‌కు వెళ్లి పోయారంటే మెడికల్ ఆఫీసర్ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పని చేస్తున ్న డాటా మేనేజర్ రోగుల సంక్షేమానికి ఉపయోగించాల్సిన నిధులను పక్కదారి పట్టించినట్లు తెలిసింది. ఫర్నిచర్, కంప్యూటర్ల కొనుగోళ్లలో తప్పుడు కొటేషన్లు చూపించి ఎక్కువ బిల్లులు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. మరో ఆసక్తికరమైన అంశమేమంటే ఇదే వ్యక్తి ఉదయం కింగ్‌కోఠి ఏఆర్‌టీ సెంటర్‌లో పని చేసి, సాయంత్రం ఉస్మానియా ఆరోగ్యశ్రీ విభాగంలో పని చేస్తుండటం.
 
ఉస్మానియాలో తీవ్ర అంతరాయం...
ఉస్మానియా ఆస్పత్రి ఏఆర్‌టీ సెంటర్ అవుట్ పేషంట్ విభాగానికి రోజూ 250-300 మంది రోగులు వస్తుండగా, వీరికి చికిత్స చేయడానికి ఒకే మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. దీంతో వైద్య సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చికిత్స కోసం వచ్చిన కొంతమంది రోగులకు టీబీ ఉండటంతో వారు దగ్గినప్పుడు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తోంది. గాంధీలో సరిపడు మందులు ఇవ్వకపోవ డంతో తరచూ రోగులు ఆందోళనకు దిగుతున్నారు. ఇక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లోని మెడికల్ ఆఫీసర్ సమయానికి రాకపోవడం, ఒక వేళ వచ్చిన మధ్యాహ్నం రెండు గంటలకే తిరుగు ప్రయాణం కడుతుండటం వల్ల సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే రోగులకు అవస్థలు తప్పడం లేదు.

మరిన్ని వార్తలు