'చిరుత పులి' రోజుకొకటి బలి! 

28 Aug, 2019 03:11 IST|Sakshi

ప్రమాదాలు, దాడుల బారినపడి మృత్యువాత 

తెలుగు రాష్ట్రాల్లోనూ సంఖ్యలో క్షీణత 

ప్రాజెక్ట్‌ లెపర్డ్‌ చేపట్టాలంటున్న జంతు ప్రేమికులు..

సాక్షి, హైదరాబాద్‌: అంతరించడంలో చిరుతదే వేగం. పులుల కంటే వేగంగా అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వన్యప్రాణుల్లో చిరుతపులి ముందు వరసలో ఉందని జంతుప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లోనే ఎక్కువగా చిరుతపులులు మరణించాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 218 చిరుతలు మరణించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.  

పెరుగుతున్న మనిషి, మృగం సంఘర్షణ 
అడవులు, పచ్చదనం తగ్గిపోతూ పట్టణీకరణ విస్తరించడంతో మనుషులు–జంతువుల మధ్య సంఘర్షణ పెరుగుతోంది. జంతువులు ముఖ్యంగా చిరుతపులులు వంటివి ఆహారం కోసం గ్రామాల శివార్లలోకి, నివాస ప్రాంతాల్లోకి వస్తుండటంతో వాటిపై దాడులు పెరుగుతున్నాయి. వేట, గ్రామస్తుల దాడులతోపాటు బావుల్లో పడి, విద్యుత్‌ షాక్, రైలు,రోడ్డు ప్రమాదాలకు గురై చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఒక చిరుతపులి చనిపోతున్నట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2018లో అత్యధికంగా 460 చిరుతలు ప్రాణాలు కోల్పోయాయి. 

తెలుగు రాష్ట్రాల్లో..
2014లో రాష్ట్ర విభజనకు పూర్వం ఉమ్మడి ఏపీలో పులుల ఆవాసప్రాంతాలు, అభయారణ్యాల్లో 345 చిరుత పులులున్నట్టుగా అంచనా. పులుల మాదిరిగా దట్టమైన అడవులు, ఆహారం, నీటికి అనువైన ప్రాంతాలు, విశాలమైన పరిసరాలకే చిరుతపులులు పరిమితం కావు. అడవుల బయట అనువైన ప్రాంతాల్లో కూడా సులభంగా ఇవి జీవించగలుగుతాయి. ఈ లక్షణాలను బట్టి ఉమ్మడి ఏపీలో అడవుల బయట 250కు తక్కువ కాకుండా చిరుతలు ఉన్నాయని పర్యావరణవేత్తల అంచనా. అయితే, 2018 నాటికి ఏపీలో 300 నుంచి 350 వరకు, తెలంగాణలో 100 నుంచి 150 వరకు చిరుతపులులుంటాయని భావిస్తున్నారు.

2014లో దేశవ్యాప్తంగా పులుల ఆవాస ప్రాంతాల్లో చిరుతల సంచారానికి సంబంధించి వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సేకరించిన వివరాల ప్రకారం మొత్తం 7,872 చిరుతపులులు ఉన్నట్టు అంచనా.. అన్ని రకాలుగా కలుపుకుంటే.. మొత్తంగా 15 వేల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. 2018కు సంబంధించి పులుల గణణ వివరాలను అధికారికంగా ప్రకటించారు. చిరుతల సంఖ్యను ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా, పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్న విధంగానే...రాజస్తాన్‌లో మాదిరిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిరుతల కోసం ప్రత్యేకంగా ‘ప్రాజెక్ట్‌ లెపర్డ్‌’ను ప్రారంభించాలని హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ ప్రతినిధి ఇమ్రాన్‌ సిద్ధిఖీ కోరుతున్నారు.

మరిన్ని వార్తలు