పశుసంపద పైపైకి 

29 Apr, 2019 10:24 IST|Sakshi

ఆత్మకూరు(పరకాల): జిల్లాలో పశుగణన పూర్తయ్యింది. 2012 సంవత్సరంలో జరిగిన గణనతో పోలిస్తే ఈసారి పశువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్‌ గొర్రెల పథకంతో  12,832 మందికి 21 గొర్రెల చొప్పున పంపిణీ చేశారు. దీంతో గొర్రెల సంఖ్య పెరిగింది. అలాగే మిగతా జాతి పశువులు, కోళ్ల సంఖ్య కూడా పెరిగింది. జిల్లాలో ఆవులు, ఎద్దులు 1,13,431, గేదెలు, దున్నపోతులు 1,42,582, గొర్రెలు 7,92,050, మేకలు 1,22,208, పందులు 8,826, కుక్కలు 2,464, కుందేళ్లు 32, కోళ్లు 20,58,459, బాతులు 1,418 ఉన్నాయి.

కేసీఆర్‌ స్కీమ్‌తో..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పథకంతో లబ్ధిదారులకు గొర్రెలు అందాయి. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసుకొచ్చి లబ్ధిదారులకు అందచేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 21గొర్రెల చొప్పున అందజేశారు. ఫలితంగా గొల్లకురుమలు ఉపాధి పొందడంతో పాటు ఆదాయం కూడా సమకూర్చుకుంటున్నారు.

ప్రోత్సాహకాలతో..
ప్రభుత్వం పాడిపరిశ్రమలో వివిధ ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. దీంతో రైతులు పశువుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. డెయిరీలకు కూడా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది.  ఉత్సాహవంతులు డెయిరీలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు.

స్త్రీనిధి రుణాలతో..
మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి రుణాలు రూ.50వేల నుంచి లక్ష వరకు రుణాలు ఇస్తున్నారు. స్వయం ఉపాధిలో భాగంగా మహిళలు గేదెలు కొనుగోలు చేసి పాలను స్థానిక డెయిరీలకు సరఫరా చేస్తున్నారు. రోజువారీ ఆదాయంతో పాటు పాడి పరిశ్రమ వృద్ధి చెందుతోంది.

పశుపోషణ వైపు యువత చూపు..
నిరుద్యోగ యువత పశుపోషణ వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఇంటిదగ్గరే ఉండి స్వయం ఉపాధి పొందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ద్వారా కోళ్ల పెంపకం, పశుపెంపకం తదితర పాడి పరిశ్రమపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఫలితంగా కోళ్ల ఫారాలను నెలకొల్పి కోళ్లను పెంచి ఉపాధి పొందుతున్నారు.

మరిన్ని వార్తలు