వేట ఆగేదెప్పుడు? 

15 Mar, 2019 14:31 IST|Sakshi

మహదేవపూర్, పలిమెల అడవుల్లో యథేచ్ఛగా వేట

చుట్టపు చూపుగా పర్యవేక్షిస్తున్న అధికారులు

సాక్షి, కాళేశ్వరం: మహదేవపూర్, పలిమెల మండలాల్లో వన్యప్రాణుల వేట మళ్లీ మొదలైంది. నిత్యం అడవిలోని జీవాలను వేటాడి వేటగాళ్లు చంపుతున్నారు. అడవిని కాపాడే అధికారులే పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట కొసాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. వేసవి కాలం కావడంతో అడవి జీవాలు దాహం తీర్చుకునేందుకు అడువుల్లో  ఉండే నీటి గుంటల వద్దకు రావడంతో వేటగాళ్లు ఉచ్చులు వేసి పట్టుకుంటున్నారు. విద్యుత్‌ తీగలు అమర్చి షాక్‌ ఇచ్చి చంపుతున్నారు. అడవుల్లో ఉండే కుందేలు, దుప్పులు, జింకలతో పాటు అడవిపందులను వేటాడుతున్నారు. ఈ మాంసాన్ని, చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 

కిలో రూ. 300..
మామూలుగా మేక మాంసం కంటే అడవి జంతువుల మాంసానికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. వేటాడిన దుప్పి మాంసాన్ని వేటగాళ్లు మరీ చౌకగా కిలో రూ. 300ల వరకు విక్రయిస్తున్నారు. మహదేవపూర్, పలిమెల అడవి ప్రాంతాల్లో వేటాడిన జంతువుల మాంసం భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాల, చెన్నూరు వరకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఇలా నిత్యం అడవి మాంసాన్ని విక్రయిస్తు వేటగాళ్లు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. 

వన్యప్రాణుల కనుమరుగు..
ఇలా నిత్యం వేట కొనసాగుతుంటే రాబోయే కా లంలో వన్యప్రాణలు కనుమరుగు అయ్యే పరిస్ధితి నెలకొంది.  గతంలో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, సాంబార్, కుందేళ్ళు, అడవి పందులు గుంపులు గుంపులుగా దర్శనమిచ్చెది. అడవుల్లో వేటగాళ్లు చెలరేగిపోతుండడం, అడవులు పలచబడడంతో వన్యప్రాణుల మనుగడ తగ్గుతూ వస్తోంది. 

చుట్టపు చూపుగా..
అడవుల్లో ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికా రులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం అ డవులను పర్యవేక్షించాల్సిన అధికారులు చుట్టపు చూపుగా అడవులకు వెళ్తున్న పరిస్థితి ఉంది.   అడవులు అంతరించి పోతున్నా అటువైపు చూసిన దాఖలాలు లేవు. కలప సరిహద్దులు దాటుతున్నా, వన్యప్రాణుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

నిత్యం పర్యవేక్షిస్తున్నాం..
ప్రతినిత్యం అడవులతో పాటు సిబ్బందిని పర్యవేక్షిస్తున్నాం. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు. ఇలాంటివి తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.
– జగదీశ్వర్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌వో

మరిన్ని వార్తలు