దాహమే ప్రాణం తీస్తోంది!

22 Mar, 2020 09:59 IST|Sakshi
నీటిలో నుంచి దుప్పులను తీసుకొస్తున్న అటవీశాఖ సిబ్బంది, స్థానికులు

గ్రావిటీ కాల్వలో పడిన నాలుగు దుప్పులు

ఒకటి మృతి,  సురక్షితం కాపాడిన అటవీశాఖ అధికారులు, స్థానికులు

సాక్షి, కాళేశ్వరం: అడవి నుంచి నీటి కోసం వచ్చి గ్రావిటీ కాల్వలో పడి దుప్పి మృతి చెందిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్‌ నుంచి అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ వరకు 13.50 కిలోమీటర్ల దూరం నీటిని తరలించడానికి గ్రావిటీ కాల్వ ను ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యాన నిర్మించారు. కాగా, శనివారం తెల్లవారుజామున దాహం తీర్చుకునేందుకు నాలుగు దుప్పులు కాల్వలోకి దిగి పైకి ఎక్కడం రాక కొట్టుమిట్టాడాయి.

లక్ష్మీపంపుహౌస్‌లో పంపులు నడుస్తుండడంతో నీటి ప్రవాహం ఉండగా.. స్థానికులు సమాచారాన్ని అటవీశాఖ డిప్యూటీ రేంజర్‌ సురేష్‌కుమార్‌కు తెలియజేశారు. దీంతో ఆయన సిబ్బందితో కాల్వ వద్దకు చేరుకున్నారు. అధికారులతో పాటు స్థానికులైన మోహన్‌రెడ్డి, దీన్‌మహ్మద్, సంతోష్‌ నీటిలోకి దిగి రెండు గంటల పాటు శ్రమించి దుప్పులకు పైకి తీసుకువచ్చారు.  అప్పటికే ఒక దుప్పి మృత్యువాత పడగా.. మిగతా మూడింటిని అడవిలో వదిలి పెట్టారు. కాగా, రెండు నెలల్లో గ్రావిటీ కాల్వలో పడి మూడు దుప్పులు మృత్యువాత పడ్డాయి. నీటి కోసం వచ్చి దుప్పులు ప్రాణాలు కోల్పోతున్న ఇరిగేషన్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని,  గ్రావిటీ కాల్వకు ఇరువైపుల ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు