వైద్యురాలిగా.. ప్రజా ప్రతినిధిగా..

30 Jun, 2019 15:04 IST|Sakshi

రెండు రంగాల్లోనూ సేవలు అందిస్తున్న అనితారెడ్డి  

ఇటీవల జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక 

‘ఆర్ట్‌’ ఫౌండేషన్‌ ద్వారా స్వచ్ఛంద సేవ 

సాక్షి, మహేశ్వరం: ప్రజా ప్రతినిధిగా, వైద్యురాలిగా సేవలు అందిస్తూ భేష్‌ అనిపించుకుంటున్నారు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి.  వైద్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ‘ఆర్ట్‌’ ఫౌండేషన్‌ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేపు (జూలై 1న) ‘డాక్టర్స్‌ డే’ సందర్భంగా అనితారెడ్డిపై ప్రత్యేక కథనం. 

కర్ణాటకలో వైద్య విద్య పూర్తిచేసిన తీగల అనితారెడ్డి కొంత కాలం  నగరంలో ఓవైసీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న దక్కన్‌ మెడికల్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రెండేళ్లు మహబూబ్‌నగర్‌లో ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2010లో ఆమె మామ, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రోత్సాహంతో దిల్‌సుఖ్‌నగర్‌లో టీకేఆర్‌ ఐకాన్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఉచితంగా సేవలు అందించారు. వైద్య సేవ చేస్తూనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని 2016లో ఆర్‌కేపురం కార్పొరేటర్‌గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓటమి చెందినా నిరుత్సాహ పడకుండా మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ కార్యాక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ఇటీవల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో మహేశ్వరం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొంది జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనా తన ఆస్పత్రిలో వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ఆర్ట్‌(అనితారెడ్డి తీగల) ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేశారు. ఇవే కాకుండా ఉమెన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ శిబిరం, స్వచ్ఛ భారత్, మొక్కల నాటడం తదితర స్వచ్ఛ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తాను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నా వైద్య వృత్తిని వీడనని, ఆర్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటానని అనితారెడ్డి చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు