ఆ చిన్నారుల ముఖాల్లో చిరునవ్వుల కోసమే..!

1 Oct, 2018 09:26 IST|Sakshi

సాక్షి’తో ఇన్‌స్పెక్టర్‌ గుళ్ళపల్లి లక్ష్మీమాధవి

సాక్షి, సిటీబ్యూరో: అవగాహన లేనితో చిన్న చిన్న వివాదాలతో వైవాహిక బంధాలను తెంచుకుంటున్న పాతబస్తీకి చెందిన భార్యభర్తలను కలపడటంలో కీలకపాత్ర పోషించిన ఇన్‌స్పెక్టర్‌ గుళ్ళపల్లి లక్ష్మీమాధవికి ప్రతిష్ట్మాతకమైన ఇండో–యూకే (లండన్‌) కల్చరల్‌ ఫోరం అవార్డు దక్కిన విషయం విదితమే. దీనిని అందుకోవడం వెనుక నిర్విరామ కృషితో పాటు ఉన్నతాధికారుల ప్రోత్సాహం ఉందన్నారు. అవార్డు గ్రహీత మాధవిని నగర కొత్వాల్‌ అంజనీ కుమార్, అదనపు సీపీ టి.మురళీకృష్ణ, సంయుక్త సీపీ తరుణ్‌జోషి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే... ‘నగర పోలీసు విభాగం నుంచి ఐక్యరాజ్య సమితి భద్రతాదళానికి ఎంపికై విదేశాల్లో విధులు నిర్వర్తించి తిరిగి వచ్చాక ఐటీ సెల్‌లో పని చేశా. అప్పటి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సార్‌ నాకు పాతబస్తీలో ఉన్న మహిళా ఠాణాలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ ప్రాంతంలో నిరక్షరాస్యత, పేదరికం తదితర కారణాలతో చిన్న చిన్న వివాదాలకే వైవాహిక బంధం తెంచుకోవడానికి సిద్ధమయ్యేవారు. దీనికోసం వారు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేవారు. అలా వారు విడిపోతే వారికి పుట్టిన పిల్లల పరిస్థితి ఏమిటనేది నన్ను కలచివేసింది.

తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ చిన్నారులు పెరగాలని, వారి ముఖంలో చిరునవ్వులు చిందాలని ఆశించాం. తొలినాళ్లలో నాకు తెలిసిన విధంగా వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి ప్రయత్నించా. అయితే అది వారికి చేరాల్సిన రీతిలో చేరలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించా. చివరకు ఖరాన్, షరాయత్‌ల్లో ఉన్న ప్రకారం చెబితేనే వారికి పూర్తి స్థాయిలో అర్థం అవుతుందని, తమ మనసు మార్చుకుని కలసి ఉంటారని భావించాం. దీంతో కొన్ని రోజులు శ్రమించి ఆ రెంటినీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేశా. ఆ తర్వాత నుంచి పోలీసుస్టేషన్‌లోనే ప్రత్యేక కౌన్సెలింగ్‌ విభాగం ఏర్పాటు చేసి వారిలో మార్పునకు కృషి చేశా. అక్కడ పని చేసిన 25 నెలల్లో దాదాపు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 11.30 వరకు ఠాణాకే పరిమితమయ్యా. ఉదయం 11 నుంచి కౌన్సెలింగ్‌ మొదలయ్యేది. ఇలా ఈ కాలంలో దాదాపు రెండు వేల జంటలు విడిపోకుండా చేశా.

అలాగే పాతబస్తీలోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి యువతులు, మహిళలు, కొందరు యువకులతోనూ నిరంతరం సంప్రదింపులు జరిపా. వారికి పోలీసు విభాగం అందిస్తున్న సౌకర్యాలు, వినియోగించుకోవాల్సిన విధానం తదితరాలు వివరించాం. వీటన్నింటినీ మహిళా ఠాణా అధికారిక ఫేస్‌బుక్‌ పేజ్‌లో క్రమంతప్పకుండా పోస్ట్‌ చేస్తూ వచ్చాం. ఈ అంశాలనే ఇండో–యూకే (లండన్‌) కల్చరల్‌ ఫోరం పరిగణలోకి తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన ‘హానర్‌’ మ్యాచ్‌లెస్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ బెటర్‌మెంట్‌ ఆఫ్‌ సొసైటీ అవార్డు ప్రకటించింది. నాకు ప్రతి దశలోనూ సహాయసహకారాలు అందించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞురాలినై ఉంటా. ఈ అవార్డు నాలో బాధ్యతల్ని మరింత పెంచి, విధులకు పునరంకితం అయ్యేలా చేసింది’ అన్నారు.

మరిన్ని వార్తలు