‘అన్నపూర్ణ’.. అక్షయ పాత్ర!

5 May, 2020 09:28 IST|Sakshi

సోమవారం ఒక్కరోజే 1.56 లక్షల మందికి ఆహారం  

అభాగ్యుల క్షుద్బాధ తీరుస్తున్న జీహెచ్‌ఎంసీ

తాత్కాలిక, మొబైల్‌ క్యాంటీన్ల సంఖ్య 342కు పెంపు

ఇప్పటివరకు 41 లక్షల మందికి భోజనం అందజేత

లాక్‌డౌన్‌ కష్టకాలంలో ఆదుకుంటున్న దాతలు

సాక్షి, సిటీబ్యూరో: ఆకలిగొన్న అభాగ్యుల పాలిట నగరంలోని అన్నపూర్ణ క్యాంటీన్లు అక్షయ పాత్రగా నిలుస్తున్నాయి. అసహాయుల క్షుద్బాధను తీరుస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌తో వర్తక వ్యాపార, పారిశ్రామిక, విద్యాసంస్థలు మూతపడటంతో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదన్న సీఎం కేసీఆర్‌సూచన మేరకు, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో పేదలు, వలస కార్మికులు, విద్యార్థులు, చిరుద్యోగుల ఆకలి తీర్చేందుకుజీహెచ్‌ఎంసీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా రెగ్యులర్‌ అన్నపూర్ణ కేంద్రాలతో పాటు తాత్కాలిక, మొబైల్‌ అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్యను కూడా 342కు పెంచింది. వీటి ద్వారా సోమవారం ఒక్కరోజే  1,56,350 మందికి ఆహారాన్ని అందించినట్లు జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు  41లక్షల 48వేల మందికి అన్నపూర్ణ భోజనం అందించినట్లు పేర్కొంది.

అన్నపూర్ణ క్యాంటీన్లు, దాతలు అందించే భోజనం, నిత్యావసరాల పంపిణీ తదితరాలను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రెగ్యులర్‌గా మానిటరింగ్‌ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ మానిటరింగ్‌ వింగ్‌కు 692 మంది దాతలు అందజేసిన 6,44,300 ఆహారం ప్యాకెట్లను మొబైల్‌ వాహనాల ద్వారా పంపిణీ చేశారు. దాతల నుంచి ఆహారం, ఇతర నిత్యావసరాలు సేకరించి పంపిణీ చేసేందుకు పది మొబైల్‌ వాహనాలను వినియోగిస్తున్నారు. దాతల నుంచి భారీ స్పందన రావడంతో అధికారుల సూచన మేరకు 30 మంది వ్యాపారులు తమ టాటా ఏస్‌ వాహనాలను ఈ సేవల కోసం జీహెచ్‌ఎంసీకి ఉచితంగా కేటాయించారు. దీంతో దాతలు ఇస్తున్న భో జనం, నిత్యావసరాలను సేకరించి, సులభంగా పంపిణీ చేసే వెసులుబాటు కలిగినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

ఎందరో దాతలు..
జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌  మానిటరింగ్‌ విభాగానికి దాతల ద్వారా ఇప్పటి వరకు  520 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 2,864 రేషన్‌ కిట్స్, 60వేల బిస్కెట్స్‌ అండ్‌ కేక్స్, 4,500 లీటర్ల నూనె ప్యాకెట్లు, 2,500 లీటర్ల ఫ్లోర్‌ క్లీనర్, 3,100 గ్లౌజ్‌లు, 32,000 మాస్కులు, 4,500 కేజీల గోధుమ పిండి, 5,600 ఓట్స్‌ ప్యాకెట్లు, 1,364 పీపీఈ కిట్లు, 5,550 శానిటైజర్‌ బాటిళ్లు, 7,500 లీటర్ల శానిటైజర్‌ క్యాన్లు, 30 మెట్రిక్‌ టన్నుల పుచ్చకాయలు అందగా, వాటిని పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపింది. 2,500 లీటర్ల ఫ్లోర్‌ క్లీనర్‌ను వలస కూలీలు, యాచకుల సంరక్షణకు ఏర్పాటు చేసిన షెల్టర్‌హోంలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు