తరలిపోతున్న ‘అనంతగిరి’

14 May, 2020 12:11 IST|Sakshi
అనంతగిరి రిజర్వాయర్‌లోకి వస్తున్న నీరు

అన్నపూర్ణ నుంచి రంగనాయక

సాగర్, కొండపోచమ్మ వరకు వెళ్తున్న నీరు

ఇల్లంతకుంట, బెజ్జంకి

మండలాల్లోని చెరువులకు చేరుతున్న కాళేశ్వరం జలాలు

ఖరీఫ్‌ సీజన్‌లో చెరువులు, కుంటలకు పూర్తి స్థాయిలో జలాలు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): కాళేశ్వరం 10 ప్యాకేజీలో భాగంగా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి కాళేశ్వరం జలాలు తరలిపోతున్నాయి. అనంతగిరి(అన్నపూర్ణ) రిజర్వాయర్‌ నుంచి సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలంలోని రంగనాయకసాగర్‌లో గత పదిహేను రోజుల నుంచి కాళేశ్వరం జలాలను ఇంజనీరింగ్‌ అధికారులు విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి గజ్వేల్‌ సమీపంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి వెళ్తున్నాయి. దీంతో పాటుగా ఇల్లంతకుంట, »ñ బెజ్జంకి మండలాల్లోని చెరువులు, కుంటలను నింపేందుకు నీటిపారుదలశాఖ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అనంతగిరి(అన్నపూర్ణ) రిజర్వాయర్‌ గుండెకాయ కానుంది. మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి నేరుగా 7.65కి లోమీటర్ల దూరం సోరంగ మార్గం ద్వారా నీరు వచ్చి తిప్పాపూర్‌ పంప్‌ హౌస్‌లో చేరుతుంది. తిప్పాపూర్‌ పంప్‌ హౌస్‌ నుంచి అనంతగిరి రిజర్వాయర్‌లోకి పంపింగ్‌ చేస్తారు. ఈ రిజర్వాయర్‌ నుంచే రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్‌లకు నీటిని తరలిస్తారు.

అనంతగిరిలో 1.80టీఎంసీల నీటి నిల్వ...
మండలంలోని అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్‌లో ఇప్పటి వరకు 1.80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంజనీరింగ్‌ అధికారులు అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన అనంతగిరి గ్రామాన్ని నిర్వాసితులు పూర్తిగా ఖాళీ చేశారు.

చెరువుల్లోకి చేరుతున్న కాళేశ్వరం జలాలు..
అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి కాళేశ్వరం జలాలు మండలంలోని సోమారంపేట, రేపాక, గ్రామాల్లోని చెరువులు కుంటలకు చేరుతున్నాయి. మిగతా గ్రామాలకు కాళేశ్వరం జలాలు చేరాలంటే మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలంలోని రంగనాయకసాగర్‌ నుంచి సిరికొండ, దాచారం, పెద్దలింగాపూర్‌ చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు