కందూరు దందా

20 Jan, 2015 01:00 IST|Sakshi

అన్నారంలో అడ్డగోలు వసూళ్లు
నేటికీ ఖరారు కాని టెండర్లు
సొంత రశీదులతో కుచ్చుటోపీ
హుండీ ఎదుట సిబ్బంది దౌర్జన్యం
భక్తులకు, సిబ్బంది మధ్య ఘర్షణ
 

అన్నారం షరీఫ్ యాకూబ్‌బాబా దర్గాలో కందూరు(మొక్కులు, ఫాతియా) చెల్లించుకోవడం భక్తులకు కష్టంగా మారింది. భక్తుల నుంచి కందూరు టిక్కెట్లు, కానుకల చెల్లింపుల పేరిట సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. టెండర్లు ఖరారు కాకపోయినా సొంతంగా రశీదు టిక్కెట్లు ముద్రించి యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన భక్తులతో ఘర్షణకు దిగుతున్నారు.
 
హన్మకొండ : అన్నారం షరీఫ్ యాకూబ్‌బాబాకు కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవుల్లో భక్తులు ఉన్నారు. ఇక్కడ భక్తులు చెల్లించే మొక్కులను కందూర్లు అంటారు. కోరికలు నెరవేరిన వారు కోడి, మేకలతో కందూర్లు చెల్లిస్తారు.  వాహన పూజలు నిర్వహిస్తారు. ఏటా ఈ మొక్కులు, పూజల రూపంలో వచ్చే ఆదాయంపై ప్రభుత్వం టెండర్లు నిర్వహిస్తోంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కందూరు, పూజలకు రేట్లు నిర్ణరుుంచి.. టికెట్లు ముద్రించి భక్తుల నుంచి ఆదా యం పొందుతారు. 2014 డిసెంబరు 8వ తేదీతో పాత టెండరు ముగిసింది. 2015కుగాను కొత్త టెండర్లు ఆహ్వానించారు. అరుుతే ఇప్పటివరకు టెండర్లు తెరిచి ఎవరికీ దర్గా నిర్వహణ బాధ్యతలు వక్ఫ్‌బోర్డు అప్పగించ లేదు.

సొంత రశీదులు

టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో దర్గా నిర్వహణ వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉంది. దీనిని ఆసరా చేసుకుని ఇక్కడి దర్గా సిబ్బంది కొత్త దందాకు తెరలేపారు. వివిధ మొక్కులకు సంబంధించి మేక ఫాతియాకు రూ. 300, కోడి ఫాతియాకు రూ.100 ధర నిర్ణయించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆదివారం వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తులు టికెట్ల రేట్లపై ప్రశ్నించారు. గతంలో మేక ఫాతియాకు రూ.200 ఉండగా.. ఇప్పుడు రూ.300 చేశారని పర్వతగిరి మండలం కల్లెడ, నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామానికి చెందిన భక్తబృందం సభ్యులు అడిగితే ‘గతంలో అన్నారం దర్గా కాంట్రాక్టు రూ.60 లక్షలు ఉంది. ఈ యేడు రూ.1.10 కోటి అయ్యింది. అందుకే టికెట్ల ధరలు పెంచాం’ అంటూ సమాధానం ఇచ్చారు. టెండర్లు ఎప్పుడు ఖరారయ్యాని ప్రశ్నించడంతో భక్తులతో వాగ్వాదానికి దిగారు.
 
ప్రతీ ఒక్కరూ. 1000 సమర్పించాలి..

భక్తులు కానుకల పేరిట కూడా దోపిడీకి గురవుతున్నారు. కందూరు సమర్పించడానికి భక్తులు క్యూలో నిలబడాలి. నిర్వాహకులు ఈ క్యూలైన్ల వద్ద హుండీలు ఏర్పాటు చేశా రు. అక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నిల్చుని కానుకలు చదివించాలని భక్తులపై ఒత్తిడి తెస్తుంటారు. ఇలా యాకూబ్, గౌస్‌పాక్, మహాబూబియా, గుంషావళీ, బోలేషావళి, చెరువుతూముల వద్ద హుండీల పేరిట ఒక్కో కందూరుకు రూ.100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఒక్క వ్యక్తి కందూరు చెల్లించాలంటే రూ.1000 అవుతున్నారుు. కందూరు డబ్బులు చెల్లించకుంటే భక్తుల నుంచి పళ్లెలు, గిన్నెలు లాగేసుకుంటున్నారు. వీరి బాధ భరించలేక భక్తులు ప్రతీ చోట రూ.100 ముట్టజెబుతున్నారు. దర్గాలో సెక్యూరిటీ, టికెట్ కౌంటర్, ఆఫీసు నిర్వహణ పనులు నిర్వహించే సిబ్బంది తమకు కేటాయించిన పనులు పక్కన పెట్టి హుండీ కౌంటర్ల వద్దే ఉంటున్నారు.
 
 అక్రమ వసూళ్లు నిలిపేయాలి..

 దర్గాలో అక్రమ వసూళ్లు నిలిపేయాలి. హుండీల వద్ద ఎవ్వరు ఉండకూడదు. ఇక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.
 - కుమారస్వామి, స్టేషన్‌ఘన్‌పూర్
 
 దర్గా అభివృద్ధికే..

 హుండీల ద్వారా వచ్చిన ఆదాయం దర్గా అభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో హుండీల వద్ద సిబ్బంది ఉండి భక్తులను ప్రేరేపిస్తున్నారు. బలవంతంగా వసూలు చేయడం లేదు.
 - ముంతాజ్, వక్ఫ్‌బోర్డు సూపరింటెండెంట్
 
 

మరిన్ని వార్తలు