విద్యుత్‌ పీఆర్సీపై ప్రకటన రేపే!

31 Aug, 2018 02:52 IST|Sakshi

తొలుత ప్రగతిభవన్‌లో ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు

ఆ తర్వాత ప్రకటించనున్న కేసీఆర్‌

ఫిట్‌మెంట్‌పై ఉద్యోగుల్లో ఉత్కంఠ

ఆసక్తిగా ఎదురుచూస్తున్న 25 వేల మంది

గత ఫిట్‌మెంట్‌ కంటే ఎక్కువ ప్రకటించాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల వేతన సవరణపై రేపు (సెప్టెంబర్‌ 1న) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కీలక ప్రకటన చేయనున్నారు. వేతన సవరణ ఫిట్‌మెంట్‌ శాతం, వెయిటేజీ ఇంక్రిమెంట్ల సంఖ్య, వైద్య సదుపాయం తదితర అంశాలపై ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని విద్యుత్‌ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో శనివారం మధ్యా హ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి చర్చలు జరిపి అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస రావు నేతృత్వంలో నియమించిన విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ సంప్రదింపుల కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.  

నాలుగేళ్ల కిందట..
చివరిసారిగా నాలుగేళ్ల కిందట విద్యుత్‌ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్, 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో కలిపి పీఆర్సీని ప్రకటించారు. గత మార్చి 31తో ఈ పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోగా, ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. దీంతో ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో పని చేస్తున్న 25 వేల మంది విద్యుత్‌ ఉద్యోగులు కొత్త పీఆర్సీపై ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఉద్యోగులకు 25 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో వేతన సవరణను అమలు చేస్తున్నారు. చివరిసారిగా ప్రకటించిన 30 శాతం ఫిట్‌మెంట్‌ కన్నా ఎక్కువ మొత్తంలో ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఏపీలో 25 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే కొద్దిగా ఎక్కువ శాతం ఫిట్‌మెంట్‌ను తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఫిట్‌మెంట్‌ శాతంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం కీలకంగా మారనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టి నిరంతర విద్యుత్‌ సరఫరాను అమలు చేసేందుకు ఉద్యోగులు బాగా పని చేశారని కేసీఆర్‌ పలుమార్లు ప్రశంసించారు.  

జేఏసీ ప్రతినిధులతో ప్రభాకర్‌రావు చర్చలు
పీఆర్సీ ప్రకటనలో జాప్యానికి నిరసనగా ఆందోళనకు సిద్ధమైన తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ ప్రతినిధులతో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు గురువారం విద్యుత్‌ సౌధలో చర్చలు జరి పారు. సెప్టెంబర్‌ 1న ప్రగతి భవన్‌లో యూనియన్ల నేతలతో చర్చించి పీఆర్సీపై సీఎం ప్రకటన చేస్తారని ట్రాన్స్‌కో సీఎండీ హామీ ఇచ్చినట్లు జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు పద్మారెడ్డి, సాయిబాబా తెలిపారు.  

మరిన్ని వార్తలు