ఉధృతి తగ్గలే..

20 Apr, 2020 09:24 IST|Sakshi

కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్‌ కేసులు

చిక్కడపల్లిలో మరో కానిస్టేబుల్‌కు నాంపల్లిలో స్విగ్గీ డెలీవరీ బాయ్‌కి కూడా..

గ్రేటర్‌లో చాపకింది నీరులా విస్తరిస్తున్న వైరస్‌

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆదివారం కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 355కు చేరింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 500 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 131 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 16 మంది మృతి చెందారు. శనివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మునగనూర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా...తాజాగా ఇదే పోలీస్టేషన్‌లో పని చేస్తున్న రాంనగర్‌కు చెందిన మరో కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ వచ్చింది. దీంతో వైద్య వర్గాల్లోనే కాదు అటు పోలీసు వర్గాల్లోనూ ఆందోళన మొదలైంది. నాంపల్లికి చెందిన స్విగ్గీబాయ్‌కి కూడా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు మర్కజ్, దాని అనుబంధ కేసులు వెలుగు చూడగా, తాజాగా ఏ కాంటాక్ట్‌ లేని వారిలోనూ వైరస్‌ ఉన్నట్లు నిర్థారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం గాంధీలో 650 కేసులు ఉండగా, వీటిలో 550పైగా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 50 మంది 14 ఏళ్లలోపు చిన్నారులు, నలుగురు గర్భిణులు ఉన్నారు. వీరిలో సుమారు 30 మంది పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. సోమవారం వీరందరినీ డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉంది. ఎ ర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో ప్రస్తుతం 14 పాజిటివ్‌ కేసులు ఉం డగా, మరో 30 మంది కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. కొత్తగా 15 మంది అడ్మిట్‌ కాగా, నలుగురు డిశ్చార్జి అయ్యారు.  ఇక ఫీవర్‌లో 27 మంది అనుమానితులు ఉన్నారు.  

చిక్కడపల్లి పోలీస్టేషన్‌లో ఇద్దరి కానిస్టేబుళ్లకు పాజిటివ్‌
చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితం ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా తాజాగా కంటైన్‌మెంట్‌ దగ్గర విధులు నిర్వహిస్తున్న మరో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మరో ఐదుగురు కానిస్టేబుళ్లను, తోటి సిబ్బందిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు తరలించారు. అలాగే రాంనగర్‌ పోచమ్మ టెంపుల్‌ సమీపంలో నివసించే భార్య, ఇద్దరు పిల్లలు, వాచ్‌మెన్, ఇరుగు పొరుగువారిని మొత్తం 14 మందిని ఆదివారం రామంతాపూర్‌లోని హోమియో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. దీంతో ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కరోనా వైరస్‌ సోకినవారి జాబితా 10కి చేరగా, అందులో నలుగురు డిశ్చార్జ్‌ కాగా, ఆరుగురు చికిత్స పొందుతున్నారు. 

స్విగ్గీ డెలివరీ బాయ్‌కు...
నాంపల్లి: స్విగ్గీ డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న యువకుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా పాజిటి వచ్చినట్లుగా తెలిసింది. బాధితుడు నాంపల్లిలోని రెడ్‌హిల్స్‌కు చెందిన 20 సంవత్సరాల యువకుడిగా గుర్తించారు. అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఈ మధ్యకాలంలో ఎవరెవరికి ఫుడ్‌ డెలివరీ చేశాడో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

నిలోఫర్‌ వైద్యులు క్వారంటైన్‌కు..  
నాంపల్లి: నిలోఫర్‌లో రెండు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌ రావడంతో యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అటు చిన్నారి కుటుంబ సభ్యులు, ఇటు సేవలందించిన నిలోఫర్‌ వైద్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15,16,17వ తేదీలలో విధులను నిర్వహించిన ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు చిన్నారికి సేవలందించిన సిబ్బందిని క్వారంటైన్‌కు వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే మహబూబ్‌నగర్‌కు చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను కూడా శనివారం క్వారంటైన్‌కు తరలించారు. పాజిటివ్‌ వచ్చిన చిన్నారిని గాంధీ ఆసుపత్రికి మార్చారు. తాజాగా ఆదివారం చిన్నారికి సేవలందించిన వైద్యులు, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. 

కేపీహెచ్‌బీలో ఓ వ్యక్తికి...  
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఆదివారం ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. కేపీహెచ్‌బీలోని చివరి బస్టాప్‌ సమీపంలో గల ఓ ఇంటిలో నలుగురు బ్యాచిలర్స్‌ నివాసముంటున్నారు. అందులో ఓ వ్యక్తికి పాజిటివ్‌ రాగా మిగిలిన ముగ్గురినీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. కేపీహెచ్‌బీలోని రమ్యాగ్రౌండ్స్‌ వార్డు కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ కూతురుకు కరోనా లక్షణాలు కనిపించటంతో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు కూకట్‌పల్లిలో పాజిటివ్‌ కేసులు ఐదుకు చేరాయి. 

ఓల్డ్‌సీఐబీ క్వార్టర్స్‌లో మూడు కేసులు
ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ డివిజన్‌ ఓల్డ్‌ సీఐబి క్వార్టర్స్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 16న ఓల్డ్‌సీఐబి క్వార్టర్స్‌లో యాబై సంవత్సరాలు పైబడిన వృద్దురాలు అనారోగ్యంతో మృతిచెందగా అదే రోజు అంత్యక్రియలు పూర్తిచేశారు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న అధికారులు, వైద్యులు ఆ కుటుంబంలో 8 మందిని ముందు జాగ్రత్తగా వైద్యపరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించి పరీక్షలు చేయగా ఆదివారం మృతిచెందిన వృద్ధురాలి కుమార్తె, 10 సంవత్సరాల్లోపు ఇద్దరు మనవరాళ్లకు కరోనా ఉన్నట్లు తేలడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఓల్డ్‌సీఐబీ క్వార్టర్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో 20 మందిని, ఆమె పెద్ద కూతురు నివాసముండే అపార్ట్‌మెంట్‌లో, చిన్నకూతురు నివాసముండే ఇళ్లల్లో 11 మందిని మొత్తంగా 31 మందిని వైద్య పరీక్షలకోసం సరోజిని, ఎర్రగడ్డ నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌కు తరలించారు. మృతురాలి అంత్యక్రియల్లో పాల్గొన్న వారినితో పాటు  ఆ కుటుంబంతో సంబంధాలున్న బందువులు నివాసముండే టోలిచౌకి, షేక్‌పేట, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో కూడా నివాసముండే వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.  

ఆసిఫ్‌నగర్‌లో నాలుగు  పాజిటివ్‌ కేసులు
విజయనగర్‌కాలనీ: జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–12 ఆసిఫిన్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం కార్వంటైన్‌లో ఉన్న మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  

కంటైన్మెంట్లలో క్వారంటైన్‌ ఇలా...
జీహెచ్‌ఎంసీ పరిధిలో 151 కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఉండగా, వీటిలో ఏప్రిల్‌ 20 నాటికి 76 ప్రాంతాల్లో క్వారంటైన్‌ ముగిసిపోతుంది. 25వ తేదీ నాటికి 26 ప్రాంతాల్లో, 30వ తేదీ నాటికి 28 జోన్లలో, మే 3వ తేదీ నాటికి 21 జోన్లలో క్వారంటైన్‌ ముగియనుంది. మే 7 తర్వాత క్వారంటైన్‌లో ఉన్న ప్రాంతాల్లో కేసుల హెచ్చు తగ్గులను బట్టి నిబంధనలను సడలించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు