మరో 5 లక్షల ఇళ్లు మంజూరుకు సిద్ధం

29 Jun, 2017 02:38 IST|Sakshi
మరో 5 లక్షల ఇళ్లు మంజూరుకు సిద్ధం

► కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంజీఎస్‌వై) కింద తెలంగాణకు మంజూరు చేసిన ఇళ్లను పూర్తిచేస్తే, మరో 5 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర తోమర్‌తో ఆయన ఇక్కడ భేటీ అయ్యి తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి అమలవుతున్న పథకాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

పీఎంజీఎస్‌వై కింద కేంద్రం తెలంగాణకు రూ. 203 కోట్లను విడుదల చేసిందని, అయితే దీనికి రూ.135 కోట్ల మ్యాచింగ్‌ గ్రాంటును రాష్ట్రం విడుదల చేయలేదని తోమర్‌ తెలిపారు. గ్రామీణ తాగునీటి పథకం కింద రూ. 88 కోట్లు ఇవ్వగా, అందులో ఇంకా రూ. 37 కోట్లు ఖర్చు చేయలేదని తోమర్‌ వివరించారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.262 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. ఇక పీఎంజీఎస్‌వై కింద కేంద్రం మంజూరు చేసిన 38,157 ఇళ్లను డబుల్‌ బెడ్రూమ్‌లతో లింకు పెట్టడంతో ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతుందని దత్తాత్రేయకు వివరించారు.

మరిన్ని వార్తలు