నిమ్స్‌కు మరో 500 పడకలు

2 Jul, 2019 02:42 IST|Sakshi

ఔట్‌పేషెంట్లకు ప్రత్యేక బ్లాక్‌ నిర్మాణం 

వైద్యపరికరాల ప్రారంభోత్సవంలో మంత్రి ఈటల 

హైదరాబాద్‌: నిమ్స్‌ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినట్లుగా వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనంగా మరో 500 పడకలను పెంచుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఆస్పత్రికి వచ్చే ఔట్‌ పేషెంట్ల కోసం లైబ్రరీ భవనం సమీపంలో ఓ ప్రత్యేక బ్లాక్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రిలోని మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ విభాగాల్లో రూ. 2.50 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన పలు వైద్య పరికరాలతో పాటుగా అత్యవసర విభాగంలో రూ.30.40 లక్షలతో ఏర్పాటు చేసిన బ్లడ్‌ ఇర్రాడియేటర్‌ యంత్రాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నిమ్స్‌ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకూ మరింత పెరుగుతోందని అందుకే జిల్లా, ఏరియా స్థాయి ఆస్పత్రులను మరింత బలోపేతం చేసి, నిమ్స్‌పై భారం పడకుండా చూస్తామని చెప్పారు. రోగులకు అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన బ్లడ్‌ ఇర్రాడియేటర్‌ యంత్రం ద్వారా దాతల నుంచి సేకరించిన రక్తం లోని టీ సెల్స్‌ను తగ్గించి, ఇన్‌ఫెక్షన్‌ సమస్యలు తలెత్తకుండా చూస్తుందని చెప్పారు.  

పరికరాల పునరుద్ధరణకు చర్యలు 
నిమ్స్‌ సహా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సాంకేతిక సమస్యలతో పని చేయని వైద్యపరికరాలను పునరుద్ధరిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల చెప్పారు. ప్రభుత్వ నిధులతో పాటుగా ఆస్పత్రి అంతర్గత నిధులు, దాతల సహకారంతో అత్యాధునిక వైద్యపరికరాలు సమకూర్చడమే కాకుండా ఆయా వార్డులను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు మంత్రిని కలసి క్రమబద్దీకరించాలని కోరారు. మంత్రి వెంట డైరెక్టర్‌ డాక్టర్‌ మనో హర్, ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.  

>
మరిన్ని వార్తలు