సాగర్‌లో మరో బీసీ బాలుర గురుకుల పాఠశాల

6 Mar, 2019 11:04 IST|Sakshi
భవనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తదితరులు

నాగార్జునసాగర్‌ : అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో మరో బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తెలిపారు. మంగళవారం పైలాన్‌ కాలనీలోని బీఈడీ కళాశాలలో పెద్దవూర మండలపార్టీ అధ్యక్షుడు కర్నబ్రహ్మానందరెడ్డితో కలిసి రికార్డులను పరిశీలించారు. గురుకుల పాఠశాల ఏర్పాటుకు కావాల్సిన భవనం కోసం ఆ కళాశాల ఆవరణలోనే మధ్యంతరంగా నిలిచిపోయిన భవనంతో పాటు మరికొన్ని ఎన్‌ఎస్‌పీకి చెందిన గోదాంలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో 119 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరైనట్లు వెల్లడించారు. అందులో భాగంగానే సాగర్‌ నియోజకవర్గానికి పాఠశాల మంజూరైనట్లు తెలిపారు. విద్యపరంగా ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఆచార్య నాగార్జునుడి సన్నిధిలో ప్రపంచ దేశాలనుంచి  విద్యార్థులు వచ్చి అభ్యసించినట్లు పేర్కొన్నారు. అందుకే ఆ పాఠశాలను సాగర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన భవనం నిర్మించే వరకూ పాఠశాల తాత్కాలికంగా నడిచేందుకు భవనం అవసరమని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలోనే ప్రారంభించాల్సి ఉందని అందుకే భవనాలను పరిశీలించినట్లు తెలిపారు. బీఈడీ కళాశాల కూడా ఇక్కడే ఉంటుందని ఆ కళాశాలను నల్లగొండకు తరలించడమనేది లేదన్నారు. ఎమ్మెల్యే వెంట తుమ్మడం బీసీగురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ జనార్థన్‌రెడ్డి,  కర్నబ్రహ్మానందరెడ్డి, శేఖరాచారి, శ్రీను తదితరులున్నారు.    

మరిన్ని వార్తలు