ప్రభుత్వంపై జేఏసీ మరో లడాయి

11 Dec, 2017 03:54 IST|Sakshi

అనుమతించి అరెస్టులు చేయడంపై కోర్టు ఉల్లంఘన ఫిర్యాదు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంపై పలుమార్లు న్యాయపోరాటానికి దిగిన తెలంగాణ జేఏసీ మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యవహారశైలి, పోలీసుల నిర్బంధంపై కోర్టుకు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. కొలువుల కొట్లాటకు హాజరయ్యేవారిని అడ్డుకోవద్దని చెప్పినా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జేఏసీ నేతలను నిర్బంధించి, అరెస్టు చేసి కోర్టు ఆదేశాలను కూడా పోలీసులు, ప్రభుత్వం ఉల్లంఘించాయని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన పోలీసులపై, ప్రభుత్వంపై హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని జేఏసీ నేతలు యోచిస్తున్నారు.

కొలువుల కొట్లాట సభకు అనుమతి ఇవ్వాలని పలుమార్లు కోరినా అనుమతి ఇవ్వకపోవడంతో జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఈనెల 4న సభను నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతించారు. ఈ సభను జేఏసీ విజయవంతంగా పూర్తిచేసింది. అయితే జిల్లాల్లోనూ, రాజధానిలోనూ జేఏసీ నేతలను సభకు హాజరుకాకుండా నిర్బంధించారని జేఏసీ నేతలు అంటున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో జేఏసీ నేతలను నిర్బంధించారు, ఎక్కడెక్కడ వాహనాలను అడ్డుకున్నారనే వివరాలను ఆధారాలతో సహా సేకరిస్తోంది. ఒకటిరెండు రోజుల్లో పూర్తి వివరాలను సేకరించి, హైకోర్టులో ఫిర్యాదు చేయడానికి జేఏసీ ఏర్పాట్లు చేసుకుంటున్నది.

మరిన్ని వార్తలు