న్యాయవాదుల నిధికి మరో వంద కోట్లు

2 Jun, 2018 02:14 IST|Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చెప్పి ఒప్పిస్తానని మంత్రి ఇంద్రకరణ్‌ హామీ

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.  న్యాయవాదుల సంక్షేమనిధికి మరో రూ.వంద కోట్లు ఇచ్చేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఒప్పిస్తామని న్యాయ, దేవాదాయ, ధర్మాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల సంక్షేమం కోసం 2015లోనే రూ.వంద కోట్లు కేటాయించామని గుర్తు చేశారు.

వంద కోట్ల బ్యాంకు డిపాజిట్‌పై వచ్చే వడ్డీతో తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌ రూపొందించిన పథకాలను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఇక్కడ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రాల్లోని కోర్టు ఆవరణల్లో కక్షిదారులకు విశ్రాంతి గదులను నిర్మిస్తామన్నారు. వీటి నిర్మాణానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వెచ్చించనున్నట్లు చెప్పారు.  

నేటి నుంచి ఆరోగ్య బీమా అమలు
జూనియర్‌ న్యాయవాదులకు స్టైపండ్‌గా రూ.ఐదు వేలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఈ మొత్తాన్ని పెంచే విషయంపై పరిశీలిస్తామని ఇంద్రకరణ్‌ చెప్పారు. రాష్ట్రంలోని 18 వేల మంది న్యాయవాదులు, వారి భార్య లేదా భర్తలకు శనివారం నుంచే ఆరోగ్య బీమా పథకం అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొ న్నారు.

జిల్లాల్లోని బార్‌ అసోసియేషన్లకు మౌలిక వసతుల కల్పన , గ్రంథాలయం ఏర్పాటు కోసం న్యాయవాదుల సంఖ్యను బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకూ ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. న్యాయపరమైన అంశాలపై వారంలో ఐదు రోజులపాటు నల్సార్‌ యూనివర్సిటీలో జూనియర్‌ న్యాయవాదులకు శిక్షణ ఇప్పిస్తామని హామీనిచ్చారు.

జూనియర్‌ న్యాయవాదులు ఆఫీసు/పుస్తకాల కొనుగోలుకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్‌ జిల్లా కోర్టును కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్‌ చెప్పారు. కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు బి.వినోద్‌కుమార్, ట్రస్ట్‌ సభ్యుడు సహోదర్‌రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, ట్రస్ట్‌ కార్యదర్శి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి బాచిన రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు