గజ్వేల్.. ఇక జిగేల్!

11 Jul, 2014 23:40 IST|Sakshi
గజ్వేల్.. ఇక జిగేల్!

గజ్వేల్: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ అభివృద్ధిలో మరో కీలక మలుపు.. రెండున్నరేళ్ల క్రితం నగర పంచాయతీగా ఏర్పడిన గజ్వేల్.. మున్సిపాలిటీగా ఆవిర్భవించడానికి అవసరమైన అన్ని అర్హతలను సాధించింది. ఈ నేపథ్యంలో స్థానిక కమిషనర్ డెరైక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(డీఎంఏ)కు లేఖ పంపేందుకు సంసిద్ధమయ్యారు. లేఖ పంపగానే కొద్ది రోజుల్లోనే నగర పంచాయతీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కానుంది.
 
 మేజర్ పంచాయతీగా ఉన్న గజ్వేల్ 2012 జనవరిలో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నగర పంచాయతీలో గజ్వేల్‌తోపాటు ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, క్యాసారం గ్రామాలు విలీనమైన విషయం విదితమే. ఫలితంగా నగర పంచాయతీ పరిధి విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర పంచాయతీ పరిధిలో మొత్తం 37,881 జనాభా ఉండగా, 9,011 ఇళ్లు, మరో 15 మురికివాడలున్నట్లు గుర్తించారు. సర్కార్ నిబంధనల ప్రకారం అప్పట్లో ఉన్న పరిస్థితులకనుగుణంగా దీనిని నగర పంచాయతీగానే ఏర్పాటుచేశారు. ప్రస్తుతం నగర పంచాయతీలో జనాభా 50 వేల పైచిలుకు చేరుకుంది. అదేవిధంగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో  రూ.5.11 కోట్లకుపైగా, 2013-14కు వచ్చేసరికి రూ.8.19 కోట్లకుపైగా ఆదాయాన్నిసాధించింది.
 
  పట్టణ పరిధి కూడా మున్సిపాలిటీ స్థాయికి తగ్గట్టుగా విస్తరించింది. అన్ని అర్హతలు కలిగివున్న నేపథ్యంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీని వెంటనే మున్సిపాలిటీగా మారుస్తామని, వెంటనే నగర పంచాయతీకి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన లేఖను అందించాలని వచ్చిన సమాచారం మేరకు స్థానిక కమిషనర్ సంతోష్‌కుమార్ లేఖ పంపించేందుకు సిద్ధమవుతున్నారు. లేఖ వెళ్లిన కొద్ది రోజుల్లోనే గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించే అవకాశం వుంది. ఈ విషయాన్ని కమిషనర్ సంతోష్‌కుమార్ ‘సాక్షి’కి ధ్రువీకరించారు.
 

మరిన్ని వార్తలు