జిల్లాకు మరో పదవి

5 Jun, 2014 00:36 IST|Sakshi

ఆదిలాబాద్ : కేసీఆర్ సర్కారులో జిల్లాను మరో పదవి వరించింది. ఆదిలాబాద్ ఎ మ్మెల్యే జోగు రామన్నకు ఇప్పటికే మంత్రి పదవి  దక్కగా, ఇప్పుడు జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు వేణుగోపాలాచారికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి పదవి లభించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవికి కేబినేట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ముథోల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం విదితమే.

 గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలతో చారికి ఈ పదవి దక్కింది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. హామీల కమిటీ చైర్మన్‌గా వేణుగోపాలాచారి బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ల వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ, ఇతర అనుమతులు తీసుకురావడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడం వంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అధినేత కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని వేణుగోపాలాచారి ‘సాక్షి ప్రతినిధి’తో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు