వైద్య ఆరోగ్యశాఖలో మరో అధికారిపై వేటు

14 Mar, 2015 02:42 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో మరో అధికారిపై బదిలీవేటు వేశారు. ఇటీవలే వైద్య పరికరాల కొనుగోళ్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో భారీగా అక్రమాలు జరగడం, ప్రభుత్వం దీనిపై సీరియస్ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ర్ట మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈడీ రాజేందర్‌పై కూడా బదిలీ వేటు వేశారు. ఇటీవలే రూ.208 కోట్ల విలువైన వైద్య పరికరాల కొనుగోళ్ల విషయంలో సంస్థలో అధికారులపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కొనుగోళ్లు రద్దు చేశారు.

 

కాగా, రెండ్రోజుల క్రితం కొన్ని శస్త్రచికిత్సల పరికరాలు, బ్యాండేజీ, కాటన్ కొనుగోళ్లలో సరఫరాదారులు కమీషన్లు ఇవ్వాలనిఈడీపై ఒత్తిడి తెచ్చారని, దానికి అంగీకరించని సప్లయర్లు, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు చేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో రాజేందర్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో అదే శాఖకు చెందిన పద్మాకర్‌ను నియమిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.

మరిన్ని వార్తలు