మరో పిల్లల మర్రి!

13 Jul, 2020 10:25 IST|Sakshi
పిల్లలమర్రిలోని లోపలి భాగం

నవాబుపేట మండలం కొత్తపల్లిలో ..

పాలమూర్‌ జిల్లా, నవాబుపేట: పాలమూర్‌ జిల్లాలో మరో పిల్లలమర్రి వెలుగులోకి వచ్చింది. వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డ మర్రి చెట్టు ఉన్న కొత్తపల్లి అప్పట్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండటం, జిల్లాకేంద్రానికి దూరం కావటంతో మరుగునపడింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ఈ గ్రామం నవాబుపేట మండలంలోకి వచ్చింది. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అందంగా కనిపిస్తోంది. మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్లు, జిల్లాకేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ మహావృక్షం ఉంది. ఈ చెట్టు నీడన ఆంజనేయస్వామి ఆలయం.. ఆలయానికి ఎదురుగానే వృక్షం మొదలు ఉంది. ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలని మండలవాసులు కోరుతున్నారు.

గోసాయి మర్రిగా..
గతంలో ఈ వృక్షం కింద గోసాయిలుగా పిలవబడే సాధువులు చాలామంది తపస్సు చేస్తూ ఈ ప్రాంతవాసులకు కనిపించటంతో గోసాయి మర్రిగా పిలుస్తారు. నాటి ముఖ్యమంత్రులు ఎన్‌టీఆర్, వైఎస్‌ఆర్‌ల దృష్టికి ఈ మర్రి గురించి వివరించామని.. అప్పటి పరిస్థితుల్లో వెలుగులోకి రాలేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుత పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

 అభివృద్ధి చేయాలి..
చరిత్ర గల మర్రి చెట్టు. ఇప్పటికే చాలావరకు అంతరించింది. ఆదరణ లేకపోతే మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. చెట్టు నీడన పురాతన ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. పర్యాటక మంత్రి చొరవ చూపితే అభివృద్ధి చెందుతుందని మా ఆకాంక్ష. – నీరజారెడ్డి, సర్పంచ్, కొత్తపల్లి

మరిన్ని వార్తలు