నిరుద్యోగులను జాబ్‌తో కనెక్ట్‌ చేస్తుంది

4 Aug, 2017 00:53 IST|Sakshi
నిరుద్యోగులను జాబ్‌తో కనెక్ట్‌ చేస్తుంది

► నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపే మార్గం
► ప్రత్యేక వాహనం రూపొందించిన నగర పోలీసులు
► కమ్యూనిటీ పోలీసింగ్‌ చర్యల్లో భాగంగానే
► ప్రారంభించిన డీజీపీ

 
సాక్షి, హైదరాబాద్‌ :  ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు, సుహృద్భావ వాతావరణం నెలకొల్పడం కోసం నగర పోలీసులు అమలు చేస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్‌లో మరో ముందడుగు పడింది. నిరుద్యోగులైన యువ తకు వారివారి ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగావ కాశాలు కల్పించడం కోసం సిటీ పోలీసులు ‘జాబ్‌ కనెక్ట్‌’పేరుతో ఓ ప్రత్యేక వాహనాన్ని రూపొందించారు. దీన్ని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో ప్రారంభించారు.

ఏమిటీ వాహనం..?
ప్రస్తుతం నగరంలోని బస్తీలు, కాలనీల్లో నిరుద్యోగ, అర్హతలకు తగిన ఉద్యోగాలు లేని యువత ఎందరో ఉన్నారు. వీరంతా ఉద్యోగాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడం కూడా వీరికి గగనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు ‘జాబ్‌ కనెక్ట్‌’వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనం షెడ్యూల్‌ ప్రకారం నిత్యం కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు స్టేషన్ల ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగులు, ఎలాంటి అండదండలు లేనివారు ఉంటున్న ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని వెళ్తుంది.

ఎలా ఉపకరిస్తుంది?
దీని నిర్వహణ కోసం నగర పోలీసు విభాగం టీఎంఐ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వీరు సిటీలోని రిటైల్‌ రంగంతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉన్న ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ఆయా ప్రాంతాల కు వెళ్లినప్పుడు అక్కడి యువత ఈ వాహ నంలో ఉన్న సిబ్బందిని సంప్రదించడం ద్వారా ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు.

అలాగే తమ అర్హతలు, ఆసక్తుల్ని రిజిస్టర్‌ చేసుకోవ చ్చు. ఇలా రిజిస్టర్‌ అయిన వారికి అనువైన ఉద్యోగం ఉన్నట్‌లైతే ‘జాబ్‌ కనెక్ట్‌’సిబ్బంది ఎస్సెమ్మెస్‌ ద్వారా సమాచారం ఇచ్చి సమన్వ యం చేస్తారు. అవసరమైన వారికి ఇంటర్వ్యూ తదితరాల్లో శిక్షణ కూడా ఇస్తారు. అంతేకా కుండా... ‘జాబ్‌ కనెక్ట్‌’వ్యాన్‌కు అమర్చిన స్క్రీన్‌ ద్వారా ప్రజలకు అవసరమైన సూచ నలు, సలహాలను పోలీసులు అందిస్తుంటారు. మరోపక్క నగర పోలీసులు రూపొందించిన ‘హాక్‌–ఐ’యాప్‌ ద్వారానూ నిరుద్యోగులు రిజిస్టర్‌ చేసుకునే అవకాశం ఇచ్చారు.

‘చేయూత’స్ఫూర్తితో...
నార్త్‌జోన్‌ డీసీపీ బి.సుమతి గత ఏడాది డిసెంబర్‌ 4న ‘చేయూత’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసు సిబ్బందిని వారి పరిధుల్లో ఉన్న కాలనీలు, బస్తీలకు పంపడం ద్వారా మొత్తం 7,540 మంది నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం టీఎంఐ సంస్థతో కలిసి 40 కంపెనీలతో భారీ జాబ్‌మేళా నిర్వహించి 1,300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీంతో సీపీ మహేందర్‌రెడ్డి ఈ విధానం అన్ని ఠాణాల పరిధుల్లోనూ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాన్‌కు రూపమిచ్చారు.


నిస్పృహకు లోనైతే ఇబ్బందే
విద్యార్హతలు ఉన్న తర్వాత ఉద్యో గాలు రాకపోతే యువత నిస్పృహకు లోనవుతారు. అలాంటి వారే దారితప్పి నేరాలకు పాల్పడే ఆస్కారం ఉంది. అలా కాకుండా చేయడానికి ఇలాంటి చర్యలు చాలా కీలకం. నగర పోలీసులు ‘జాబ్‌ కనెక్ట్‌’ను పరిచయం చేయడం శుభపరి ణామం. ఇది పోలీసింగ్‌లోనే కొత్త ఒరవడి. – అనురాగ్‌ శర్మ, డీజీపీ

పరిచయాలు అవసరం లేకుండా
కంపెనీలో తెలిసిన వారి అవసరం లేకుండా అర్హులైన యువతకు ఉద్యోగావ కాశాలు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగాల కల్పనలో దేశంలోనే మంచి పేరున్న టీఎంఐ సంస్థతో కలసి పని చేస్తున్నాం. ప్రధానంగా బస్తీలు, నిరుపేదలు నివసించే, వెనుకబడిన కాలనీలపై దృష్టి పెట్టనున్నాం.  – ఎం.మహేందర్‌రెడ్డి, నగర కొత్వాల్‌

ఆ రెండిటికీ వారధిగా పనిచేస్తాం
అనేక సంస్థల్లో ఉన్న ఉద్యోగాల వివరాలను తెలుసుకోవడం, నిరుద్యోగులకు ఆ వివరాలు తెలిపి అర్హులైన వారి పొందేలా చేయడం...
ఈ రెండిటికీ మధ్య మేము వారధిగా పనిచేస్తాం. ఈ వ్యాన్‌ ద్వారా ఉద్యోగాల కోసం తిరిగే అవకాశంలేని వారి ముంగిట్లోకి అవకాశాలను తీసుకువెళ్తాం. – మురళీధరన్, టీఎంఐ చైర్మన్‌

మరిన్ని వార్తలు