'కరోనా' చికిత్సకు కొత్త ఆస్పత్రి

20 Apr, 2020 04:12 IST|Sakshi

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌..

నేడు గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ప్రారంభం

గాంధీ తరువాత ‘కరోనా’ చికిత్సలందించేది ఇక్కడే..

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్సలు అందించేందుకు మరో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సిద్ధమైంది. గచ్చిబౌలి క్రీడాప్రాంగణంలోని 13 అంతస్తుల భవనంలో 1,500 పడకలతో ఉస్మానియాకు అనుబంధంగా ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విత్‌ పీజీ కాలేజ్‌)’ పేరుతో ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో సోమవారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఇకపై సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన పనిలేదు. ఐటీ కారిడార్‌లోని హైటెక్‌సిటీ, నానక్‌రాంగూడ, మాదాపూర్‌తో పాటు టోలిచౌకి, గోల్కొండ, వికారాబాద్‌ నుంచి వచ్చే వారికి ఈ కొత్త ఆస్పత్రిలోనే వైద్యసేవలు అందుతాయని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా కరోనా వైరస్‌ బారినపడిన వారికే చికిత్స అందిస్తారు. వైరస్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టాక, ఇది పూర్తిస్థాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపుదిద్దుకోనుంది. అత్యవసర వైద్యం సహా గుండె, కాలేయం, కిడ్నీ, ఆర్థోపెడిక్‌ వంటి పూర్తిస్థాయి వైద్యసేవల్ని అందించనుంది. çఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, బిహార్‌కు చెందిన వెయ్యి మంది కూలీలు 20 రోజులు రేయింబవళ్లు శ్రమించి దీనికి రూపునిచ్చారు. ఇప్పటికే సివిల్‌వర్క్స్‌ సహా ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో మిషన్‌ భగీరథ ద్వారా ఆస్పత్రికి నీటిని అందించే అవకాశం ఉంది. చదవండి: 500 దాటిన కరోనా మరణాలు 

పాజిటివ్‌ కేసులకు ఇక్కడే చికిత్స
ఆరో అంతస్తులో పడకలను ఏర్పాటు చేశారు. ఒక్కో పడక మధ్య 8 నుంచి 12 అడుగుల దూరం ఉంది. వాటి పక్కనే సహాయకులు కూర్చొనేందుకు కుర్చీతో పాటు వెంట తెచ్చుకున్న వస్తువులు భద్రపర్చుకునేందుకు లాకర్‌ను ఏర్పాటు చేశారు. ఒక అంతస్తులో కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఉంటే, ఆ పై అంతస్తులో పాజిటివ్‌ కేసుల బాధితులు ఉంటారు. ప్రతి అంతస్తులో రెండు నర్సింగ్‌ స్టేషన్లు, రోగులను పరీక్షించడానికి ప్రత్యేక గది సిద్ధం చేశారు. ఐసోలేషన్‌ కేంద్రంలో చికిత్సలు అందించేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేస్తున్న 77 మంది వైద్యులు, 115 మంది స్టాఫ్‌ నర్సులను డిప్యుటేషన్‌పై ఇక్కడ నియమించారు.

అవసరమైతే ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న జనరల్‌ మెడిíసిన్, అనస్థీషియన్‌ వైద్యులు సహా పారిశుద్ధ్య, సెక్యురిటీ కార్మికుల సేవలను తాత్కాలికంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇప్పటికే గాంధీ సహా కింగ్‌కోఠి, ఛాతీ, ఫీవర్, సరోజినీదేవి, నేచర్‌క్యూర్, యునానీ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో వైరస్‌ సామూహిక వ్యాప్తిచెందే ప్రమాదం ఉండటంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఈ సూపర్‌ స్పెషాలిటీ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

20 రోజులు.. వెయ్యి మంది కూలీలు
నాడు.. 2007లో జరిగే 4వ మిలటరీ వరల్డ్‌ గేమ్స్‌ను పురస్కరించుకుని దివంగత నేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ విలేజ్‌ పేరుతో 13 అంతస్తుల భవనం నిర్మాణం కోసం 2006 అక్టోబర్‌ 3న శంకుస్థాపన చేశారు. మిలటరీ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారికి అప్పట్లో ఇక్కడే వసతి కల్పించారు. అనంతరం అదే భవనంలో రాష్ట్రస్థాయి క్రీడాకారులకు వసతి కల్పించి ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. వైఎస్సార్‌ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ భవనాన్నే కాదు క్రీడాంశాల్లో శిక్షణను పెద్దగా  పట్టించుకోలేదు.

శాట్స్‌కు ఎంపికైన వారికి ఒక అంతస్తులోనే వసతి కల్పించేవారు. మిగిలిన అంతస్తుల్లోని గదులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ విస్తరిస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటం, ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోవడం, అదనంగా మరికొన్ని ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి రావడంతో ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని ఇటీవల స్వాధీనం చేసుకుంది. రోజుకు వెయ్యి మంది కూలీలను ఉపయోగించి కేవలం 20 రోజుల్లోనే ఈ అత్యాధునిక ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చింది. చదవండి: కరోనా పరీక్షల్లో ఏపీకి 2వ స్థానం

ప్రత్యేకతలు..
పేరు:   తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌
గచ్చిబౌలి క్రీడాప్రాంగణం విస్తీర్ణం: 9 ఎకరాలు
భవనం విస్తీర్ణం: 5.30 లక్షల చ.మీ.
భవనంలోని మొత్తం అంతస్తులు: 13
ఒక్కో అంతస్తులో ఉండే గదులు: 36
భవనంలోని మొత్తం గదులు: 468
మొత్తం పడకలు: 1,500
ఐసీయూ పడకలు: 500

మరిన్ని వార్తలు