కవ్వాల్‌లో పులుల కదలికలు!

27 Feb, 2020 08:05 IST|Sakshi
జైనథ్‌ మండలం నిరాల వద్ద రోడ్డు దాటుతున్న పులి

జైనథ్‌ మండలం నిరాల వద్ద రోడ్డు దాటిన వైనం

కారులో నుంచి సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీసిన వ్యక్తి

పులుల సంచారంతో  భయం భయం

సాక్షి, ఆదిలాబాద్‌ : జిల్లాలో పులులు సంచరిస్తున్నాయి. ఆదిలాబాద్‌ శివారు మండలాల్లో గత కొద్ది రోజులుగా పులుల సంచారంపై అలజడి నెలకొన్నా పక్కా ఆధారాలు లభించలేదు. కాని మంగళవారం రాత్రి పులి జైనథ్‌ మండలం నిరాల వద్ద అంతర్రాష్ట్ర రహదారి దాటుతుండగా రోడ్డుపై కారులో వెళ్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీయడంతో ఇప్పుడు పులులు తిరుగుతున్నాయనేది నిజమైంది. అయితే తాంసి, భీంపూర్‌ మండలాల్లో సంచరించిన పులుల్లో ఇది ఒకటా..! లేదా మరోటా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా పులుల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 
కారులోంచి ఫొటో క్లిక్‌..
సురక్షిత వన ప్రాంతం కోసం వెతుకులాడుతున్న పులులు మధ్యలో ఆదిలాబాద్‌ శివారు మండలాల్లోని జనవాసాల్లోంచి వెళ్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి బయటకు వస్తున్న పులులు పెన్‌గంగ నది దాటి వచ్చి ఆవాసం ఏర్పర్చుకునేందుకు అడుగులు వేస్తూ చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాలు, పంట పొలాలు, రోడ్లు దాటుతూ వెళ్తున్నాయి. బేల మండలం అవాల్‌పూర్‌కు చెందిన కె.అనిల్‌ అవాల్‌పూర్‌ నుంచి ఆదిలాబాద్‌కు మంగళవారం రాత్రి కారులో వస్తుండగా నిరాల వద్ద రాత్రి 10.40 గంటలకు పులి రోడ్డు దాటుతున్నప్పుడు తన సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీశాడు. ఆ తర్వాత కొద్ది దూరంలోని లక్ష్మీపూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్ద నీళ్లు తాగి వెళ్లినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే అది వాస్తవమో కాదోనన్నది తెలియరాలేదు. తాంసి, భీంపూర్‌ మండలాల్లో ఆవులు, ఎద్దులపై దాడి జరిగిన సంఘటనలను బట్టి రెండు పులులు సంచరిస్తున్నాయనే వదంతులు వినిపించాయి. తాజాగా జైనథ్‌ మండలం నిరాలలో రోడ్డు దాటుతూ ఒక పులి కనిపించింది. ఆ మండలంలోని దేవుజీగూడ గ్రామంలో ఎద్దులపై పులి పంజా విసిరింది. అక్కడ దాని అడుగులు కనిపించాయి. ఈ నేపథ్యంలో తాంసి, భీంపూర్‌లో సంచరించిన పులుల్లో ఇదొకటా.. లేనిపక్షంలో ఇది మరొక పులినా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


దేవుజీగూడలో పులి అడుగు, పులి దాడిలో గాయపడ్డ ఆవు

ఆవాస బాట..
పెన్‌గంగకు అవతలి వైపు మహారాష్ట్ర భాగంలోని తిప్పేశ్వర్‌ పులుల అభయారణ్యంలో పులుల పునరుత్పత్తి పెరిగింది. ప్రధానంగా అక్కడ టైగర్‌ రిజర్వు ప్రాంతంలో 3 గ్రామాలు ఉండగా, ఆ ప్రజలను అక్కడి నుంచి తొలగించి పునరావాసం కల్పించినట్లు ఇక్కడి అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. పులులకు నీళ్లు, వేట కోసం వన్యప్రాణుల లభ్యత ఉండటం, ప్రశాంత వాతావరణం నేపథ్యంలో ఆడ, మగ పులుల కలయికతో పునరుత్పత్తి పెరిగినట్లు చెబుతున్నారు. అలాగే శాఖహారులైన వన్యప్రాణుల కోసం గడ్డి విత్తనాలు పెంచడం, తద్వారా ఆ వన్యప్రాణులు గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి. ఈ వన్యప్రాణులు పులులకు ఆహారంగా మారుతాయి. ఇటువంటి అనువైన పరిస్థితుల్లోనే అక్కడ పులుల సంఖ్య పెరగడానికి దోహదపడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే తిప్పేశ్వర్‌ అభయారణ్యం విస్తీర్ణంలో చిన్నది కావడం, ఇటు పులుల సంఖ్య పెరిగిన దృష్ట్యా నిర్దిష్ట ఆవాసం కోసం పులులు తిప్పేశ్వర్‌ను వీడి మరోప్రాంతం కోసం కదులుతున్నాయి. అవి విస్తీర్ణంలో చాలా పెద్దదైన కవ్వాల్‌ చేరితే ఈ ప్రాంతంలో వాతావరణ సమతుల్యత ఏర్పడేందుకు దోహద పడతాయని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు కవ్వాల్‌లో పులుల సంచారం ఉన్నా స్థిర నివాసం ఏర్పర్చుకోలేదని, ఈ నేపథ్యంలో ఈ పులులు కవ్వాల్‌ వైపు వెళ్తే మాత్రం వాటికి నిర్దిష్ట ఆవాసానికి సరిపడ వాతావరణం ఉందంటున్నారు.

రాత్రి వేళల్లోనే సంచారం 
పులులు రాత్రి వేళల్లోనే సంచరిస్తాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రతీరోజు సుమారు 20 కిలో మీటర్ల వరకు కదులుతాయని పేర్కొంటున్నారు. పగటి వేళా విశ్రమిస్తుంది. ఒక ప్రత్యేక ప్రాంతంలో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రాంతంలో కనిపించిన పులి కొద్ది రోజులు ఆ సమీపంలో ఉండి వెళ్లిపోతుంది. ఇదిలా ఉంటే అటవీ శాఖాధికారులు పులుల విషయంలో గోప్యత పాటిస్తున్నారు. అదే సమయంలో వాటికి జనావాసాల సమూహాల్లో ప్రశాంతత వాతావరణం కల్పించడం ద్వారా అభయారణ్యానికి తరలిపోతాయని చెబుతున్నారు. పంట పొలాల చుట్టూ విద్యుత్‌ వైర్లు అమర్చకుండా చూస్తున్నారు. ప్రధానంగా గ్రామస్తులు భయంతో వాటిని హతమర్చేందుకు ఇలాంటి చర్యలకు దిగే ఆస్కారం ఉందని, ముందు జాగ్రత్తగా అటవీ శాఖాధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తాంసి, భీంపూర్‌ ప్రాంతాల్లో ఇప్పటికీ బేస్‌ క్యాంప్‌ను కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు