వీడని వర్షం

20 Jul, 2017 04:05 IST|Sakshi
వీడని వర్షం

రాష్ట్రమంతటా ఎడతెరపి లేని వాన
నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు
♦  భద్రాచలం వద్ద 22 అడుగులకు గోదావరి

సాక్షి నెట్‌వర్క్‌/హైదరాబాద్‌: రాష్ట్రంలో వానల జోరు బుధవారమూ కొనసాగింది. పలు జిల్లాల్లో వరుసగా నాలుగో రోజూ వానలు పడ్డాయి. అల్పపీడనం కారణంగా గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత కూడా మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

‘‘అల్ప పీడనం పశ్చిమ దిశగా వెళ్తుండటంతో ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 6.5 సెం.మీ., దోమకొండలో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 40 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి’’అని తెలిపారు.

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రానికి రాష్ట్రవ్యాప్తంగా అబ్జర్వేటరీలు లేక వర్షపాత వివరాలు ఒక రోజు ఆలస్యంగా వెల్లడవుతున్నాయి. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో కుండపోత కురిసింది. కామారెడ్డి పట్టణంలోనూ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వాగులు ఉప్పొంగి పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, రాంనగర్‌ గ్రామాల మధ్య లో లెవల్‌ కాజ్‌వే పై నుంచి జీడి వాగు  ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం నుంచి గర్భిణిని రాంనగర్‌ వద్ద జీడి వాగు దాటించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో 4 సె.మీ., జోగుళాంబ గద్వాల జిల్లాలో అలంపూర్‌ మండలంలో అత్యధికంగా 3 సెం.మీ. వర్షం నమోదైంది.

మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. నాలుగు నెలలుగా నీరులేక వెలవెలబోయిన గోదారి ఒక్కసారిగా నిండుకుండలా మారింది. ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద రెండు కిలోమీటర్ల మేరకు వరదనీరు పుష్కర ఘాట్, పూసురు ఒడ్డును తాకుతోంది. బుధవారం సాయంత్రం ఐదింటి వరకు 6.74 మీటర్ల నీటి మట్టం నమోదైంది. రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి 6.8 మీటర్లకు చేరింది. గురువారం నాటికి మరింత పెరిగేలా ఉంది. ఇంద్రావతి నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద కూడా గోదావరికి వరద పెరుగుతోంది.  22 అడుగుల మేరకు నీరు చేరింది. తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి వరదనీరు బుధవారం నుంచి తగ్గుముఖం పట్టింది. 14 గేట్లను ఎత్తి 28 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు