1,472 మందికి ఒకే డాక్టర్‌

9 Feb, 2019 00:53 IST|Sakshi

ఎంపీ వినోద్‌ ప్రశ్నకు కేంద్రం సమాధానం 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 1,472 మందికి ఒక డాక్టర్‌ చొప్పున అందుబాటులో ఉన్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి లోక్‌సభలో ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యిమందికి ఒక డాక్టర్‌ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలో డిసెంబరు 31, 2018 నాటికి భారత వైద్య మండలి వద్ద 11.46 లక్షల మంది అలోపతిక్‌ వైద్యులు నమోదై ఉన్నారని, ఇందులో దాదాపు 80 శాతం మంది సేవలు అందిస్తారని అంచనా వేస్తే దాదాపు 9.17 లక్షల మంది వైద్యులు ఉన్నారని వివరించారు.

వీరు కాకుండా 7.63 లక్షల ఆయుర్వేద, యునానీ, హోమియోపతి వైద్యులు నమోదై ఉన్నారని, వీరిలో 80 శాతం మంది సేవలు అందిస్తున్నట్లు అంచనా వేస్తే వీరి సంఖ్య 6.10 లక్షలుగా ఉంటుందని వివరించారు. 2.5 లక్షల మంది దంత వైద్యులు ఉన్నారని వివరించారు.  దేశంలో వైద్యుల సంఖ్య పెంచేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని, అనేక స్పెషలిస్ట్‌ విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకుల నిష్పతిని 1:2 నుంచి 1:1కు తగ్గించామన్నారు. ఎంబీబీఎస్‌ సీట్ల గరిష్ట ప్రవేశాల పరిమితిని 150 నుంచి 200కు పెంచామని, వైద్య కాలేజీల స్థాపన నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చామని  పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైద్య కాలేజీలను అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా వాటిని బలోపేతం చేసి ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు చౌబే తెలిపారు.  

మరిన్ని వార్తలు