సినిమా టి‘కేటుగాళ్ల’పై నజర్‌ 

4 Feb, 2019 01:43 IST|Sakshi

ఇక నుంచి టికెట్‌ ధర ఎంత ఉన్నా జీఎస్టీ 12 శాతమే 

దీని ప్రకారం టికెట్‌ ధరలు తగ్గించని యాజమాన్యాలపై కఠిన చర్యలు 

ప్రత్యేక తనిఖీల కోసం రంగంలోకి యాంటీ ప్రాఫిటరింగ్‌ విభాగం 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ..  

ఇప్పటికే హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లపై గురి 

టికెట్‌ ధర తగ్గించకపోతే తీవ్ర చర్యలుంటాయంటున్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ఆసరాగా చేసుకుని సినిమా టికెట్ల పేరుతో ప్రేక్షకుల నుంచి ఎక్కువ ధరలను వసూలు చేస్తున్న థియేటర్‌ యాజమాన్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాస్తవానికి రూ.100 కన్నా ఎక్కువ ఉన్న సినిమా టికెట్లపై మొదట్లో 28 శాతం జీఎస్టీ విధించారు. కానీ, గత కౌన్సిల్‌ సమావేశంలో ఈ మొత్తాన్ని 18 శాతానికి తగ్గించి ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చారు. అయితే, కొన్ని థియేటర్ల యాజమాన్యాలు టికెట్లపై 28 శాతం జీఎస్టీ అని ముద్రించి ప్రేక్షకుల నుంచి వసూలు చేసిన తర్వాత ప్రభుత్వానికి మాత్రం 18 శాతమే చెల్లిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు హైదరాబాద్‌లో ఉన్న మల్టీప్లెక్స్‌ థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో కొన్ని థియేటర్లు తగ్గించిన జీఎస్టీని వసూలు చేస్తుండగా, మరికొన్ని పాత జీఎస్టీ ప్రకారమే వసూలు చేస్తున్నాయని తేలింది. దీంతో ఎక్కువ మొత్తంలో జీఎస్టీని వసూలు చేస్తున్న థియేటర్‌ యాజమాన్యాలపై సాక్ష్యాలతో కేసు నమోదు చేసిన అధికారులు విచారించే ప్రక్రియను యాంటీ ప్రాఫిటరింగ్‌ విభాగానికి బదిలీ చేశారు. ఈ మేరకు ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ థియేటర్‌పై విచారణ జరిపేందుకు గాను హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ ఆదేశాలిచ్చారు. దీంతో పాటు నగరంలోని పలు థియేటర్లను తనిఖీలు చేసి సినిమా టికెట్ల రూపంలో ఎక్కువ మొత్తాలను వసూలు చేస్తున్న థియేటర్ల యాజమాన్యాలపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.  

ఇప్పుడు 12 శాతమే.. 
సినిమా టికెట్లపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గిందని, తాజా బడ్జెట్‌లో ఆ వ్యత్యాసాన్ని కూడా తీసేసి ధరతో సంబంధం లేకుండా ప్రతి సినిమా టికెట్‌పై కేవలం 12 శాతమే జీఎస్టీ ఉంటుందని ప్రకటించారు. దీంతో ఇక నుంచి సినిమా టికెట్లపై 12 శాతం జీఎస్టీ మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని జీఎస్టీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత జీఎస్టీ కన్నా ఎక్కువ వసూలు చేసే థియేటర్‌ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని జీఎస్టీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇందుకోసం యాంటీ ప్రాఫిటరింగ్‌ విభాగాన్ని రంగంలోకి దించుతామని, ఉల్లంఘనలకుపాల్పడి ప్రజల సొమ్మును దోచుకుని ప్రభుత్వానికి పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.  

మరిన్ని వార్తలు